మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:21 IST)

హుజూర్​నగర్​లో​.. గెలిచేదెవరు..?

ఒకరికి ఓటమన్నదే తెలియదు.. మరొకరు గెలుపెరగరు.. అక్టోబర్​ 21 వరకు అందరి కళ్లూ ఈ స్థానంపైనే.. ఇదే సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం​.. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ ప్రాతినిధ్యం వహించిన స్థానం.

ఉత్తమ్​ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఉపఎన్నికల నగరా మోగడం వల్ల పార్టీలు అప్రమత్తమయ్యాయి. పట్టునిలుపుకోవాలని కాంగ్రెస్​.. ఎలాగైనా పాగా వేయాలని తెరాస.. గట్టి పోటీనివ్వాలని భాజపా.. వ్యూహ రచన చేస్తున్నాయి. హుజూర్​నగర్​ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్​కుమార్​రెడ్డి.. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడం వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఉపఎన్నిక అనివార్యం అయింది. అక్టోబర్​ 21న ఎన్నిక జరగనుంది. అదే నెల 24న ఫలితం తేలనుంది. జరిగేది ఒకే ఒక్క స్థానానికి ఎన్నిక.. ఫలితాలు తారుమారైనా ఉన్న సర్కారు కూలిపోదు.. నూతన ప్రభుత్వం ఏర్పడదు. కానీ.. అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం ఈ ఉపఎన్నిక చిన్నసైజు కురుక్షేత్రాన్ని తలపించే పరిస్థితి ఉంది.

అన్నింటా గులాబీనే.. కానీ గత శాసనసభ ఎన్నికల్లో పన్నెండింటికి తొమ్మిది స్థానాలతో తెరాస తన ఆధిక్యాన్ని కనబరిచింది. పార్లమెంట్​ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్​ జెండా ఎగిరింది.

అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడినా.. ప్రస్తుత ఉప ఎన్నిక మాత్రం అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2009 నుంచి హుజూర్​నగర్​లో ఉత్తమ్​ మూడుసార్లు విజయం సాధించారు. గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించినా ఉత్తమ వ్యూహాల ముందు తెరాస తలవంచక తప్పలేదు.

ఎలాగైనా... గెలవాలని స్వయంగా పీసీసీ అధ్యక్షుడి సెగ్మెంట్ కావడం వల్ల అధికార పార్టీ గట్టి కసరత్తు చేస్తోంది. మంత్రులు, శాసన సభ్యులను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. మండలానికో మంత్రి, మూడు, నాలుగు గ్రామాలకో ఎమ్మెల్యేకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

కిందటిసారి ఉత్తమ్​ ప్రత్యర్థిగా నిలిచి, ఓటమిపాలైన సైదిరెడ్డినే తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది అధికార తెరాస. ఎలాగైనా తన స్థానాన్ని నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఉత్తమ్​ కుమార్​రెడ్డి.. తన సతీమణి పద్మావతినే బరిలో నిలుపుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇంతకాలం తలో దిక్కుగా వ్యవహరించిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు.. గెలుపుకోసం ఏకతాటిపైకి వచ్చారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డితోపాటు రాష్ట్రస్థాయి నేతలంతా రంగంలోకి దిగనున్నారు. శంకరమ్మకు ఛాన్స్​.. ఇక మూడో పక్షం భాజపా సంప్రదాయ ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తమ అభ్యర్థిగా నిలపాలన్న ప్రతిపాదన చేస్తున్నట్లు సమాచారం.

కేంద్ర మంత్రుల్ని, కీలక నేతల్ని ప్రచారానికి తీసుకొస్తే ఆశించిన రీతిలో ఓట్లు పడతాయని కమలం పార్టీ విశ్వసిస్తోంది. 2014లో తెరాస అభ్యర్థిగా పోటీచేసిన శంకరమ్మ ఉత్తమ్​ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో ఆమెను కాదని శానంపూడి సైదిరెడ్డికి గులాబీ అధిష్ఠానం టికెట్​ ఇచ్చింది. దీంతో సొంత పార్టీపైనే శంకరమ్మ తీవ్ర విమర్శలు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ సైదిరెడ్డినే మరోసారి బరిలో నిలిపారు గులాబీ బాస్​ కేసీఆర్​.. అన్ని పక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం.. భారీగా అంగ, అర్థ బలాల్ని మోహరించడం, జాతీయ స్థాయి నాయకులు వచ్చే అవకాశం ఉండడం వల్ల నెలరోజుల పాటు హుజూర్​నగర్​లో వాతావరణం వేడెక్కనుంది.