డీజే సౌండ్ ఎఫెక్ట్.. మహిళకు బ్రెయిన్ స్ట్రోక్ - మృతి
తెలంగాణా రాష్ట్రంలో డీజే సౌండ్ ఎఫెక్ట్‌కు మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ శబ్దం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె కన్నుమూశారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్థరాత్రి జరిగింది. ఖమ్మం జిల్లాలోని నగర శివారు అల్లీపురంలో జరిగింది.
మృతురాలి బంధువుల కథనం ప్రకారం... స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో బంధువు వివాహ వేడుకలో కుటుంబంతో కలిసి పాల్గొంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేసింది.
ఈ క్రమంలో డీజే శబ్దానికి తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెప్పారు.
రాణి స్వగ్రామం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. దివ్యాంగుడైన భర్త ఉప్పలయ్య, కుమార్తెలు అమూల్య, అంజలితో కలిసి తన పుట్టిల్లు అల్లీపురంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రాణి మృతితో కుమార్తెలు ఆదరవు కోల్పోయారని బంధువులు తెలిపారు.