మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:48 IST)

సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపారు.. ఆ తర్వాత చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట

తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, వారు చనిపోయేముందు గ్రామ శివార్లలో ఏకాంతంగా గడిపి, ఆ తర్వాత అక్కడే చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చివ్వెం మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తూవచ్చాడు. కొన్నినెలల ప్రేమాయణం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. 
 
దీంతో మనస్తాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొద్దుల చెరువు గ్రామ శివారులో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. పిమ్మట ఓ చెట్టుకు ఉరేసుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఈ ప్రేమజంట మృతదేహాలను గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.