నాగ్ వైల్డ్ డాగ్ మూవీ ఇప్పట్లో రాదా? కరోనా భయంతో ఆ పని ఇక్కడే కానించేసారా?
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రానికి ఊపిరి, మహర్షి చిత్రాల రచయిత సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యదార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగార్జున నటిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్‌లో బాలీవుడ్ భామ సయామీ ఖేర్ నటిస్తుంది.
బాలీవుడ్ మూవీ మిర్జియా సినిమాలో నటించిన సయామీ ఖేర్... గత సంవత్సరం తన మరాఠీ మూవీతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జునతో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఫిలింగా తయారవుతున్న వైల్డ్ డాగ్ మూవీలో ఒక యాక్షన్ రోల్ చేస్తుంది.
ఇదిలా ఉంటే... ఇటీవల కాలంలో నాగార్జున నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మన్మథుడు 2 సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా కూడా నిరాశపరచడంతో ఈసారి డిఫరెంట్ మూవీ చేయాలని చాలా కథలు విని ఆఖరికి వైల్డ్ డాగ్ అనే ఈ యాక్షన్ ఫిల్మ్‌ని చేస్తున్నారు. దీంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. థాయిలాండ్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసారు.
కొన్ని కారణాల వలన ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేసారు. ఐతే కరోనా వైరస్ భయం కారణంగా సాధ్యమయినంతవరకూ విదేశాల్లో షూటింగ్ వద్దని టాలీవుడ్ పెద్దలు చెప్పినట్లు సమాచారం. అందువల్ల థాయిలాండ్లో చేయాలనుకున్న షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే చేసారని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది కానీ... అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన సమ్మర్ రేసు నుంచి వైల్డ్ డాగ్ తప్పుకుంది అని వార్తలు వస్తున్నాయి. హడావిడిగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయద్దు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌కి రెండు నెలలు టైమ్ ఉంటే అవుట్‌పుట్ బాగుంటుంది. రీ షూట్ చేయాల్సి వస్తే.. చేసి అంతా బాగుంది అనుకున్న తర్వాతే రిలీజ్ చేద్దామని నాగార్జున ఈ చిత్ర నిర్మాత, దర్శకుడుకి చెప్పినట్టు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. వైల్డ్ డాగ్ మూవీని జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ చేయలేదు. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు పని చేసిన డేవిడ్ ఇస్మాలోన్ వైల్డ్ డాగ్‌కు యాక్షన్ డైరెక్టరుగా పని చేస్తుండటం విశేషం.
ఈ సినిమాని నిర్మాతలు ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో హాలీవుడ్ స్ధాయి యాక్షన్ ఫిల్మ్‌గా దీనిని రూపొందిస్తున్నారు. దీనినిబట్టి తెలుగు తెరపై ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు.
ఇటీవల సరైన సక్సస్ లేక వెనకబడిన నాగ్ కొత్త తరహా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. కొత్త కథలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు కాబట్టి ఈ మూవీ కూడా ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. మరో విజయాన్ని అందిస్తుందని నాగార్జున కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి.. నాగార్జున నమ్మకం నిజమౌతుందో లేదో చూడాలి.