సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (10:20 IST)

భక్తవత్సలం నాయుడు (కలెక్షన్ కింగ్ మోహన్ బాబు) సినీ ప్రయాణానికి 48 యేళ్లు

mohan babu
తెలుగు చిత్రపరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది విలక్షణ నటుల్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఈయన సినిమా రంగంలోకి వచ్చి 48 ఏళ్లు అవుతోంది. నటుడిగా, నిర్మాతగా 48 ఏళ్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు. 
 
భక్తవత్సలం నాయుడు కాస్త తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి మోహన్ బాబుగా మారారు. 70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలైంది. ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అకుంఠిత భావం, కష్టపడేతత్త్వం, అంకిత భావంతో కష్టపడి ఎదిగారు. ఆయన నాడు వేసిన పునాదులపై మంచు వారి ఘనత చెక్కు చెదరని భవనంలా నిలబడింది.
 
మోహన్ బాబు తనదైన రీతిలో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్‌గా ఎదిగారు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. పాత్రలకు ప్రాణం పోయడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన చేసిన కారెక్టర్‌లు తెలుగు వారి మదిలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి.
 
సినిమా పరిశ్రమ మీదున్న మక్కువతో ఆయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కెమెరా ముందు నటించి ఎన్నో విజయాలు అందుకున్న మోహన్ బాబు.. నిర్మాతగా అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.
 
మోహన్ బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులున్నాయి. పెదరాయుడు, అసెంబ్లీరౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా.. మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి.
 
నా రూటే వేరు అంటూ మోహన్ బాబు చెప్పిన ఐకానిక్ డైలాగ్స్, మ్యానరిజం తెలుగు ప్రేక్షుకలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన డైలాగ్స్, మ్యానరిజంకు ప్రత్యేక అభిమాన గణం ఉంటుంది. ఆయనలా విలక్షణంగా నటించేవారు ఉండటం చాలా అరుదు.
 
మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పట్టుదల, అంకితభావం అందరికీ నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆయన నవతరానికి స్ఫూర్తిగానే నిలుస్తున్నారు. నటుడిగా ఐదు దశాబ్దాలకు దగ్గర పడుతున్నా.. ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన చేయబోయే తదుపరి చిత్రాలు, రాబోయే అద్భుతాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్, 'పద్మశ్రీ' అవార్డులు వరించాయన్న సంగతి తెలిసిందే..!!