శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (11:59 IST)

కొంగర జగ్గయ్య వర్ధంతి.. కళా వాచస్పతి అవతారాలెన్నో..!!

Jaggayya
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు. 
 
ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ.. త్రిపురనేని గోపిచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య సినిమాలలో అరంగేట్రం చేశారు. సినిమాల కోసం తొలుత రేడియో ఉద్యోగానికి ఏడాది పాటు సెలవు పెట్టారు. ఆ తర్వాత సినిమాల్లోనే కొనసాగేందుకు రేడియో ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. ఉన్నత చదువులకు గుంటూరు లోని ఆంధ్రా క్రిస్టియను కళాశాలలో చేరాడు. ఇక్కడే నందమూరి తారక రామారావుతో పరిచయం ఏర్పడింది. 
 
ఈ కాలేజీలో ఎన్.టి.రామారావు, కొంగర జగ్గయ్య ఇద్దరు సహ విద్యార్థులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. జగ్గయ్య మూడు సంవత్సరాలపాటు వరుసగా ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. చిత్రకారుడు అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందారు. విజయవాడలో అరుణోదయ, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ సంస్థల తరపున నాటకాలు వేశారు. 
 
డిగ్రీ పూర్తవగానే తెనాలి దగ్గర ఉన్న దుగ్గిరాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగమొచ్చింది. అప్పుడు కూడా పాఠశాలలో పనవగానే రైల్లో బెజవాడకు వెళ్ళి రిహార్సల్స్ చేయడం, నాటకాలు వేయడం చేస్తుండేవారు. ఎన్.టి.రామారావుతో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. 
 
బుచ్చిబాబు వ్రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో మూడు సంవత్సరాలపాటు వార్తలు చదివే ఉద్యోగం చేసారు. అక్కడ కూడా తెలుగువాళ్ళను పోగేసి నాటకాలు వేశారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పని చేసే టప్పుడే ఢిల్లీ రాజ్య పతనం అనే నాటకంలో జమునతో వేషం వేయించారు జగ్గయ్య గారు.
 
అర్ధాంగి, బంగారు పాప చలన చిత్రాలతో జగ్గయ్యకు మంచి పేరు తెచ్చుకున్నారు. 1950ల నుండి 1970ల వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. మరణించేవరకు కూడా అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తూనే ఉండేవారు. కొన్ని చలన చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాలలో సహాయనటునిగా, హాస్య పాత్రలలో, ప్రతినాయకుని పాత్రలలో నటించారు. 
 
"కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రోటీన్ హీరో పాత్రలు సరిపోవు." అని నమ్మిన వాడు కాబట్టే అతను విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించారు. అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వచూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవారు. ఇలా  దాదాపు 500 చిత్ర్రాల్లో నటించాడు. అతను నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి.
 
జగ్గయ్య గురించి చెప్పేటప్పుడు అతను కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠాన్ని ఎంతోమందికి అరువు ఇచ్చారు. 100కు పైగా సినిమాలలో డబ్బింగు చేసారు. తమిళ చిత్రరంగ నటుడు శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలలో జగ్గయ్యే అతనుకు గాత్రధారణ చేసేవారు. అంతేకాదు తెలుగులోకి డబ్బింగు చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకు తన గాత్రాన్ని అరువు ఇచ్చారు. 
 
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆయన రాణించారు. రాజకీయాల్లోనూ అదరగొట్టారు. సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. నోబెల్ పురస్కారము అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీతా అనే పేరుతో తెలుగులోకి అనువాదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం. రవీంద్రనాథ ఠాగూరు రాసిన నాటకం సాక్రిఫైస్ (Sacrifice) ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించారు. ఇక 2004, మార్చి 5న 76 సంవత్సరాల వయసులో చెన్నైలో గుండెపోటుతో జగ్గయ్య మరణించారు.
 
వ్యక్తిగత వివరాలు 
జననం-డిసెంబర్ 31, 1928
మోరంపూడి ఆంధ్రప్రదేశ్
మరణం-మార్చి 5, 2004, చెన్నై
ఇతర పేర్లు కళా వాచస్పతి, కంచు కంఠం జగ్గయ్య
వృత్తి- నాటకం, సినిమా, రాజకీయం
పదవి పేరు- 1967లో నాలుగవ లోక్‌సభ సభ్యులు