గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:27 IST)

తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసినవారిలో మొదటివాడు: చంద్రశేఖర ఆజాద్

భారత స్వాతంత్ర ఉద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.
 
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు. ఈయన పెసరపప్పును కనుగొన్నవారిగా కూడా ప్రసిద్ధి. 1857 తరువాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.
 
తనను తానే కాల్చుకుని...!
1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు ఎదురుతిరిగాడు.
 
వెంబడిస్తున్న పోలీసుల్లో ముగ్గురిని కాల్చి చంపాడు. ఐనా తరుముతూ వస్తున్న పోలీసులకు చిక్కే పరిస్థితి వచ్చింది. ఇక తుపాకీలో ఒకే ఒక్క బుల్లెట్ వుంది. దానితో వాళ్లను మట్టుబెట్టలేనని తెలుసుకుని, బ్రిటిష్ వారి చేతిలో చనిపోవడం కంటే తనకు తానే ఆత్మత్యాగం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే తుపాకీని తన తలకు గురిపెట్టి కాల్చుకుని అమరడయ్యాడు.     
 
ఆజాద్ ఎక్కడ జన్మించారు?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు. ఈయన చిన్నప్పటినుంచి హనుమాన్ భక్తుడిగా ఉండేవారు.
 
1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.
 
విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.