అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు బాలు గారు -సుమన్
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు బాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కోట్లాది మంది ప్రార్థనలు చేసినప్పటికీ ఈ ప్రార్థనలు ఏమీ ఫలించలేదు. దేవుడు కరుణించలేదు. బాలు ఇక లేరు అనే వార్తను ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ మీడియాకి తెలియచేసారు.
బాలు లేకపోవడం అనేది సంగీత ప్రపంచానికి తీరనిలోటు. బాలు లేరు అని తెలిసినప్పటి నుంచి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ.. అనే కాకుండా భారతదేశంలోని సినీ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని తెలియచేసారు.
ప్రముఖ సీనియర్ హీరో సుమన్ బాలు గురించి స్పందిస్తూ... నాకు బాలుగారు పాటలు పాడటమే కాదు డబ్బింగ్ కూడా చెప్పారు. నా కెరీర్ తమిళ చిత్రాలతో మొదలైంది. తమిళంలో నాకు బాలు గారు పాడారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో నటించాను. ఈ రెండు భాషల్లో కూడా బాలు గారు నాకు పాడారు. అలాగే నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అన్నమయ్య చిత్రంలోని వెంకటేశ్వర స్వామి పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పారు.
అలాగే శ్రీ రామదాసులోని రామునిగా నటించిన నాకు డబ్బింగ్ చెప్పారు. బాలు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు గుర్తుండిపోతాయి. అన్ని భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.