శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (21:37 IST)

చిత్రపరిశ్రమకు రాయితీలు .. సీఎం జగన్‌కు 'చిరు' ధన్యవాదాలు

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పించింది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
 
ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీరిచ్చిన భరోసా ఎన్నో వేల కుటుంబాలకు సహాయపడుతుందని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.
 
కాగా, ఏపీ ప్రభుత్వం కల్పించిన రాయితీల వివరాలను పరిశీలిస్తే, 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేసింది. ఇంకా ఆ తదుపరి 6 నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. 
 
అలాగే, సినిమా థియేటర్లు, మల్టిప్లెక్సులు జూలై 2020 నుంచి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించింది. అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పించింది. 
 
సినిమా థియేటర్లు యాజమానులు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ప్లెక్సు థియేటర్లకు ఇవ్వలేదు. 
 
కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్దికలిగేలా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రాయితీలపై సినీ పరిశ్రమ హర్షం వ్యక్తంచేసింది.