శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (13:22 IST)

రఘుపతి వెంకయ్య నాయుడు.. వర్థంతి.. తెలుగు సినిమా పితామహుడి గోడమీద బొమ్మ..?

Raghupathi Venkaiah
తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో మొదలైనా.. ఆపై హైదరాబాదుకు తరలి వచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల అవుతున్నాయి. ఇది తెలుగు వారికి గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు వారి యొక్క శ్రమ, పట్టుదల, త్యాగం, క్రియేటివిటీల ఫలితమేనని చెప్పాలి.

అయితే ఏ ఒక్క పనికైనా ఆద్యుడు అనేవాడు ఉంటాడు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆద్యుడు.. తెలుగు సినిమా పితామహుడు.. మచిలీపట్నంలో జన్మించి చెన్నైకి తరలివచ్చి, తిరుగులేని ఫోటోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకుని.. తన ఆస్తి అంతా కూడా త్యాగం చేసి మొదటి స్టూడియో నిర్మించారు. 
 
తెలుగు సినిమాని శ్రీలంక దాకా తీసుకెళ్లారు. వీరి పేరుతో నేషనల్ అవార్డు కూడా ఉంది. అయితే కేవలం నిర్మాతగానే కాకుండా ఒక సినిమా ప్రేమికుడిగా.. మెగాఫోన్‌ని.. ఆయన ఆస్తి అంతా తాకట్టుపెట్టి తీసుకొచ్చి.. తెలుగు సినిమాని ప్రపంచమంతా విస్తరింపచేశారు. చెన్నైలో థియేటర్ స్థాపించారు.

ఆయన ఎవరో కాదు.. రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయనే తెలుగు సినిమా పితామహుడుగా అవతరించాడు. అందుకే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1980లో ఓ అవార్డును నెలకొల్పి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన వారికి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌గా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును ప్రదానం చేస్తోంది.
 
ఇక రఘుపతి వెంకయ్య నాయుడి జీవిత విశేషాలను ఓసారి పరిశీలిస్తే.. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి సోదరుడు. రఘుపతి వెంకయ్య నాయుడుగారి స్వస్థానం మచిలీపట్నం. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు. అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్‌లలో సుబేదార్లుగా సేవలందించారు. 
Raghupathi Venkaiah
 
వీరు 15 అక్టోబరు 1869లో జన్మించారు. తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు సంగీతం వంటి ఆకర్షణలు జోడించేవాడు.
 
దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ Star of the East ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు.

'డి కాస్టెల్లో' (De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు మత్స్యావతార్, నందనార్, గజేంద్రమోక్షం వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
తరువాత తమిళ సినిమా నిర్మాత ఎ.నారాయణన్‌తో కలిసి 'గ్యారంటీడ్ పిక్చర్స్ కార్పొరేషన్', 'జనరల్ ఫిల్మ్ కార్పొరేషన్' స్థాపించారు. విశ్వామిత్ర, మాయామధుసూదన, పాండవ నిర్వహణ, రాజ్ ఆఫ్ రాజస్థాన్ వంటి మరికొన్ని మూగసినిమాలు తీశారు. వెంకయ్య తరువాత ప్రకాష్ తన సినీ ప్రయోగాలను మరింత ముందుకు తీసుకొని వెళ్ళారు. వెల్లవేసిన తెల్లటి గోడమీద సినిమా 'ప్రొజెక్ట్' చేసేవాడు. అలా దానిని 'గోడమీది బొమ్మ' అనేవారు. 
 
ప్రకాష్ కాకినాడ దగ్గర భక్త మార్కండేయ సినిమా తీశారు. అందులో కాకినాడ రాజారత్నం అనే ఆవిడ ఒక ముఖ్యపాత్ర ధరించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక. భీష్మప్రతిజ్ఞ’ తర్వాత వెంకయ్య, ప్రకాశ్‌ కలిసి గజేంద్రమోక్షం, మహాత్మా కబీర్‌దాస్‌, స్టేజ్‌గర్ల్‌, కోవలన్‌ వంటి మూకీలు ఎన్నో తీశారు. ఈ మూకీలకి ఉత్తరభారతదేశంలో మంచి గిరాకీ వుండేది. అయినా కంపెనీకి ఆర్థికమైన నష్టాలు కలగడంతో 1924 లో ‘కోర్ట్‌’ చేతిలోకి వెళ్లిపోయింది. 
 
ప్రకాశ్‌గారు మంచినటుడు. సైలెంట్‌ సినిమాల్లో ముఖ్యపాత్రలే వేశారు గాని, టాకీల్లో వెయ్యలేదు. ‘ఆయన నటించి చూపితేనే, నేను ’పార్వతీశం‘ పాత్ర చెయ్యగలిగాను’ అని పార్వతీశం పాత్రధారి, ప్రకాశ్‌ సహాయకుడు అయిన లంక సత్యం చెప్పేవారు. తానే దర్శకనిర్మాతగా ‘తారాశశాంకం (1941), బభ్రువాహన (1942 ) లో చిత్రాలు తీశారు ప్రకాశ్‌. ఆయనా శంకరరెడ్డి (’లవకుశ‘, ’రహస్యం‘ చిత్రాల నిర్మాత) కలిసి 1951 లో ’మాయపిల్ల ‘ తీశారు. ప్రకాశ్‌ డైరెక్టు చేసిన ఈ చిత్రంలో కుమారి ద్విపాత్రాభినయం చేసింది.
 
1956లో ప్రకాశ్‌ ’మూన్రుపెణగళ్‌‘ తమిళచిత్రం ,’ దేవసుందరి‘ తెలుగుచిత్రం ప్రారంభించారు. ’మూన్రుపెణగళ్‌‘ ఆ సంవత్సరంలోనే విడుదలైంది గాని ఆయన మృతి చెందడంతో ’దేవసుందరి‘ మాత్రం 1960లో విడుదలైంది. రఘుపతి వెంకయ్య, రఘుపతి సూర్యప్రకాశ్‌ తెలుగుసినిమా పరిణామ మార్గదర్శకులు. తండ్రీ కొడుకులిద్దరూ సినిమా కోసమే కష్టపడ్డారు. నష్టపడ్డారు. అంతే 1941లో తన 72వ ఏట రఘుపతి వెంకయ్య మరణించారు. అప్పులవారికి చాలా మొత్తాలు చెల్లించవలసినందున ఆయన చివరికాలానికి ఏమీ ఆస్తి మిగలలేదు అంటారు.