బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (13:43 IST)

లాక్డౌన్‌తో చుట్టుముట్టిన కష్టాలు - పండ్లు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో కూలీల నుంచి సెలెబ్రిటీల వరకు ఉన్నారు. తాజాగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఓ బాలీవుడ్ నటుడు పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని పేరు సోలంకి దివాకర్. ఈయన ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాలీవుడ్ నటుడు సోలంకి దివాకర్. ఈయన ఆయుష్మాన్ ఖురానా సినిమా 'డ్రీమ్‌గర్ల్'లో నటించి అలరించాడు. ఈ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సోలంకి.. రిషికపూర్ చివరి సినిమా 'శర్మాజీ నంకిన్'లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మూడుసార్లు వాయిదా పడగా, ఆ తర్వాత రిషికపూర్ మృతి చెందడంతో సినిమా దాదాపు ఆగిపోయినట్టే లెక్క. 
 
ఇపుడు లాక్డౌన్ కారణంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఢిల్లీ మార్కెట్లో పండ్లు అమ్ముకుంటూ కనిపించాడు. లాక్డౌన్ కారణంగా షూటింగులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నానని, నిత్యావసరాల కొనుగోలుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు దివాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు పండ్లు అమ్ముకుంటున్నట్టు చెప్పాడు.