1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 మే 2024 (14:48 IST)

కళ్ళతోనే భావాలను పలికించే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లోని నా పాత్రకు పేరు వస్తుంది : నేహా శెట్టి

Neha Shetty
Neha Shetty
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నేహా శెట్టి.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.
 
మీరు పోషించిన బుజ్జి పాత్ర గురించి చెప్పండి?
బుజ్జి అనేది 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్ర. అందంగా కనిపిస్తూనే, ధృడంగా ఉండే పాత్ర ఇది. ట్రైలర్ లో గమనిస్తే మిగతా పాత్రలతో పోలిస్తే బుజ్జి పాత్ర భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ లో మీకు అందంగా, సౌమ్యంగా కనిపిస్తుంది. కానీ చాలా శక్తిగల మహిళ పాత్ర ఇది. సినిమాలో ఈ పాత్రకి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. బుజ్జి అనేది సినిమాలో బలమైన పాత్రలలో ఒకటి. ఒకమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ ఇందులో చూడొచ్చు.
 
90లలో జరిగిన కథ అంటున్నారు. బుజ్జి పాత్ర కోసం మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు?
డైరెక్టర్ గారు నాకు శోభన గారిని రిఫరెన్స్ గా చూపించారు. చీరకట్టు, జుట్టు, కళ్ళ కాటుక ఇలా ప్రతి దాని మీద ఎంతో శ్రద్ధ పెట్టాము. 90ల నాటికి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకోవడమే కాకుండా.. అప్పటి నటీమణుల అభినయం ఎలా ఉండేదో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా హావభావాలు పలికించాను. నేను ఇప్పటివరకు ఎక్కువగా మోడ్రన్ పాత్రలే చేశాను. కానీ బుజ్జి పాత్ర అలా కాదు. అందుకే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేశాను. అయితే యాస విషయంలో మాత్రం నేను ఎటువంటి హోంవర్క్ చేయలేదు. ఎందుకంటే బుజ్జి అనేది ధనవంతుల అమ్మాయి పాత్ర కాబట్టి.. రత్న పాత్రలాగా మాటల్లో పెద్దగా యాస ఉండదు. పైగా మాటల కంటే ఎక్కువగా కళ్ళతోనే భావాలను పలికించే పాత్ర ఇది. ఈ బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది.
 
విశ్వక్ సేన్ గురించి?
విశ్వక్ సేన్ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. తీవ్ర ఎండలో కూడా షూట్ చేశాడు. మేము మంచి స్నేహితులయ్యాం. అందుకే ఎటువంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ మేము ఇబ్బంది పడలేదు.
 
అంజలి గారి గురించి చెప్పండి?
మా కాంబినేషన్ లో ఎక్కువగా సన్నివేశాలు లేవు. కానీ ఆమె గురించి చెప్పాలంటే మాత్రం.. నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటారు. సెట్ అందరితో మాట్లాడుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. విషాద సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను మౌనంగా కూర్చుంటాను. కానీ ఆమె అలా కాదు. అప్పటివరకు నవ్వుతూ ఉండి, టేక్ కి వెళ్ళగానే పాత్రకి తగ్గట్టుగా మారిపోతారు. అనుభవం గల నటిగా అంజలి గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
 
షూటింగ్ సమయంలో ఎలాంటి ఛాలెంజ్ లు ఎదుర్కొన్నారు?
వేసవి నుంచి వేసవి వరకు ఏడాది పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అధిక ఎండ వల్ల ఇబ్బంది పడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో షూట్ చేస్తున్న సమయంలో నేను లేను కానీ.. అప్పుడు అక్కడ ఎండలకి మా చిత్ర బృందంలోని పలువురికి వడదెబ్బ కూడా తగిలింది.
 
షూటింగ్ సమయంలో స్వీట్ మెమోరీస్ గురించి చెప్పండి?
స్వీట్ మెమోరీస్ చాలా ఉన్నాయి. గోదావరి పరిసరాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. రాజమండ్రి ప్రజలు చాలా స్వీట్ పీపుల్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుండేది.
 
మిమ్మల్ని చూస్తే అందరికీ డీజే టిల్లులో మీరు పోషించిన రాధిక పాత్రనే గుర్తుకొస్తుంది. అందరూ మిమ్మల్ని అలా రాధిక అని పిలుస్తుంటే ఏమనిపిస్తుంది?
మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది.. ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్ గారిని బాద్షా అని పిలుస్తారు. నేను కెరీర్ ప్రారంభంలోనే అలా రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే వాళ్ళు అభిమానంలో రాధిక అని పిలుస్తున్నారు. దానిని గౌరవంగానే భావిస్తున్నాను.
 
ఇప్పుడు వాన పాటలంటే మీరే గుర్తుకొస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవి గారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలా.. ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను.
 
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే గ్యాంగ్ ల మధ్య గొడవలు ఉంటాయి కదా. మరి మధ్యలో కథానాయికల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి?
అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి(నవ్వుతూ). ఎంత గ్యాంగ్ లు, గొడవలు ఉన్నా.. వాళ్ల జీవితాల్లో కూడా ప్రేమ కథలు ఉంటాయి కదా. అవి ఎలా ఉంటాయి అనేది మీకు సినిమా చూశాక అర్థమవుతుంది.
 
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
సితార సంస్థ అనేది ఇల్లు లాంటిది. వారి ప్రొడక్షన్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. మునుముందు సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
 
దర్శకుడు కృష్ణ చైతన్య గురించి?
కృష్ణ చైతన్య గారు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. చాలా మంచి మనిషి. ఆయన ఈ కథ రాసిన విధానం గానీ, దానిని తెరకెక్కించిన విధానం గానీ అద్భుతం.
 
ఈ సినిమాలో మీ పాత్రకి ప్రాధాన్యత ఏ మేరకు ఉంటుంది...?
విశ్వక్ 50 శాతం, అంజలి గారు 25 శాతం, నా పాత్ర 25 శాతం ఉంటుంది(నవ్వుతూ). సినిమాలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని పాత్రలు చివరివరకు ఉంటాయి.
 
తదుపరి చిత్రాల గురించి?
బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ప్రారంభమవుతుంది.