1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (15:07 IST)

కొత్త కాన్సెప్ట్ తో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం : రామ్ గోపాల్ వర్మ

Ram Gopal launched Honeymoon Express song
Ram Gopal launched Honeymoon Express song
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్స్‌ప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు. అయితే ఈ రోజు కళ్యాణి మాలిక్ స్వరపరిచి, సింగర్ సునీత తో కలిసి పాడిన అందమైన ప్రేమ గీతం 'నిజమా' పాటను సినీ లెజెండ్ రామ్ గోపాల్ వర్మ  విడుదల చేశారు.
 
అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "నా స్నేహితుడు బాల దర్శకత్వం వహించిన హనీమూన్  ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి  'నిజమా' పాటను ఇప్పుడే చూసాను, పాట చాలా మెలోడియస్ గా ఉంది, చాలా బాగా చిత్రీకరించారు. కెమెరామాన్ పనితీరు మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ పాటను నేను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కథ విన్నాను, కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం, మంచి విజయం సాధించాలి" అన్నారు.  
 
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారితో రెండు హాలీవుడ్ చిత్రాలకు పని చేశాను, బ్యూటీ ఆఫ్ ప్యాషన్ మరియు ఆట అనే రెండు చిత్రాలకు పని చేశాను, రెండు చిత్రాలు డెవలప్మెంట్ లో ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు మరియు ఆయన చిత్రాలు మా లాంటి దర్శకులకు మంచి స్ఫూర్తి. శివ చిత్రం నాకు దర్శకుడు అవటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఈరోజు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా ఆయన పక్కన ఉన్నాను. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి రొమాంటిక్ కామెడీ చిత్రం. చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ళ భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు మా చిత్రంలోని మొదటి పాట నిజమా లిరికల్ వీడియో ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.
ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్  పతాకం పై రూపొందింది.