'ఆదిపురుష్' మేకర్స్‌ను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిలబెట్టి తగలబెట్టాలి...
'ఆదిపురుష్' చిత్రం మేకర్స్‌ను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో నిలబెట్టి నిలువునా తగలబెట్టాలని 'మహాభారత్' సీరియల్‌లో భీష్ముడి పాత్రను పోషించి ముఖేశ్ ఖన్నా మండిపడ్డారు. ఈ నెల 16వ తేదీన విడుదలైన ఆదిపురుష్ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, రామయణాన్ని వక్రీకరించారనీ, సంభాషణలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో దేశాన్ని ఉర్రూతలూగించిన "మహాభారత్" సీరియల్‌లో భీష్ముడి పాత్రను పోషించిన ముఖేశ్ ఖన్నా కూడా ఈ చిత్రం మేకర్స్‌పై మండిపడ్డారు. మన పౌరాణిక గ్రంథాలను అవమానపరిచే హక్కును వీరికి ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. రామాయణాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. రావణుడికి ఏం వరాలు ఉన్నాయో కూడా వీరికి తెలియదన్నారు.
హిరణ్యకశిపుడిని కాపీ కొట్టి రావణుడికి అతికించారని విమర్శించారు. రాముడికి శివుడి ఆశీస్సులు ఉన్నాయని, ఈ విషయం కూడా వీరికి తెలియదని చెప్పారు. ఈ సినిమా మేకర్స్‌ను క్షమించకూడదని అన్నారు. 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వీరిని నిలబెట్టి తగలబెట్టాలని చెప్పారు.
ఈ చిత్రం డైలాగ్ రైటర్ మనోజ్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పుడు సిగ్గుపడాల్సింది పోయి... బయటకు వచ్చి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సనాతన ధర్మం కోసం ఈ చిత్రాన్ని నిర్మించామని చెపుతున్నారని... మీ సనాతన ధర్మం అందరి సనాతన ధర్మానికి విరుద్ధమైనదా? అని ప్రశ్నించారు.
హనుమంతుడి నుంచి అభ్యంతరకరమైన డైలాగులు చెప్పించారని అన్నారు. రాముడు, కృష్ణుడు, విష్ణువులకు మీసాలు ఉండవని... వీరిని ఇలాగే చూస్తూ అందరం పెరిగామని... అలాంటి రాముడి స్వరూపాన్నే మార్చేశారని విమర్శించారు. హిందూ మతాన్ని కామెడీ చేశారని ఆయన మండిపడ్డారు.
శ్రీరాముడు నీలం రంగులో కదా ఉండాలి : హీరో సుమన్ ప్రశ్న
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించగా సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. అయితే, ఈ చిత్రంలో రాముడు ఎరుపు రంగులో ఉన్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా హీరో సుమన్ కూడా స్పందించారు. తనకు తెలిసినంతవరకు స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి శ్రీరాముడు నీలం రంగులోనే కనిపిస్తూ వచ్చారని, కానీ, ఈ చిత్రంలో మాత్రం సాదాగా చూపించారని అన్నారు.
రాముడిగా ప్రభాస్ చాలా బాగున్నాడు.. కానీ మీసాలు పెట్టారు. ఇంతవరకూ ఎక్కడా అలా చేయలేదు. శ్రీరాముడు మహా శాంతమూర్తి .. అలాంటి ఆయనతో ఫోర్స్‌గా ఉండే డైలాగ్స్ చెప్పించారు. ఇక రావణుడికి మోడ్రన్ హెయిర్ స్టైల్ పెట్టారు. ఆయన పాత్రపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. సాంగ్స్ .. రీ రికార్డింగ్ నాకు బాగా నచ్చాయి. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కుదరలేదు అని అన్నారు.
కాగా భారీ బడ్జెట్‌తో తరెక్కించిన ఈ చిత్రంలో 'రామాయణం' కథను మొత్తం చూపిస్తారనుకుని వచ్చిన ప్రేక్షకులు అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్లడం .. శ్రీరాముడు ఆమెను తిరిగి తీసుకురావడం వరకే ఈ సినిమాలో చూపించారు. పైగా, ఇవన్నీ కూడా బొమ్మలాటల్లా గ్రాఫిక్స్ చేసి చూపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అయితే ఏకంగా ఈ చిత్రాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా లేఖ కూడా రాసింది.