ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (09:34 IST)

బాలీవుడ్ డ్రగ్స్ కేసు : డి అంటే దీపక... కె అంటే కరిష్మా.. తెరపైకి కొత్త పేర్లు!!

బాలీవుడ్ డ్రగ్స్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నటి రియా చక్రవర్తితో పాటు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. వీరివద్ద జరిపిన విచారణలో అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో వీరందరికీ సమన్లు జారీ చేసి విచారించాలన్న యోచనలో ఎన్.సి.బి ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్‌ భాషలో 'డీ' అంటే దీపిక అని, 'కే' అంటే కరిష్మా అని అనుమానిస్తున్నారు. 
 
ఎన్‌సీబీ దీపికా మేనేజర్‌ కరిష్మాకు సమన్లు జారీ చేసింది. జయా సాహా ఇచ్చిన సమాచారాన్ని బట్టి నిర్మాత మధు మంతెనకు కూడా సమన్లు జారీ చేసింది. డ్రగ్స్‌ కేసు విచారణలో ఇప్పుడు రియాతో పాటు జయా సాహా కూడా అత్యంత కీలకంగా మారారు. 
 
దీపిక, శ్రద్ధాకపూర్‌లకు ఈ వారంలో విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. వీరితో పాటు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబాటాలకు ఈ వారంలో సమన్లు జారీ చేయనున్నట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు.