ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (18:50 IST)

'నేడే విడుదల' ఆకట్టుకుంటుంది - రేటింగ్ ఎంతో తెలుసా?

nede vidudala movie
ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్ - మౌర్యాని జంటగా నటించిన చిత్రం "నేడే విడుదల". నూతన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే (మార్చ్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రచార చిత్రాలతో ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
 
కథ: 
సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో సిద్ధూ(అసిఫ్ ఖాన్) పనిచేస్తూ ఉంటారు. అదేసమయంలో హారిక (మౌర్యాని)ని ప్రేమిస్తూ ఉంటాడు. నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించి... దానిని ప్రమోట్ చేయాల్సిందిగా సిద్ధూని కోరతాడు. సినిమాని ప్రమోట్ చేసి... ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా... పైరసీ బారిన పడి అనుకోకుండా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అతని మరణం సమంజసమేనా? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోవడానికి గల కారణాలను సిద్ధూ తెలుసుకున్నాడా? తెలుసుకుని ఉంటే ఏమి చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
కథ... కథనం విశ్లేషణ: 
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి. వాటికి కాస్త మెసేజ్ ఇచ్చే కంటెంట్ జోడిస్తే... బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉండి... దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని... ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా మూవీని తెరమీద చూపించగలిగితే... సినిమా తీసిన నిర్మాతలూ సేఫ్... దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తోనే ‘నేడే విడుదల’ చిత్రం తెరకెక్కింది. ఆసక్తికరమైన కథ... కథనంతోపాటు... ఆలోచింపచేసే ఓ మెసేజ్‌ను ఇందులో ఇచ్చాడు దర్శకుడు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయిన ఈ చిత్రంలోని సన్నివేశాలు... సెకండాఫ్‌లో ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్‌తో పాటు... మరోవైపు సినిమాలో అసలు కోర్ పాయింట్‌కి కావాల్సిన మూలాలను వెతికే సన్నివేశాలను చూపించారు. సెకెండాఫ్‌లో మంగళూరుకి స్టోరీ షిఫ్ట్ అయిన తరువాత హీరోయిన్ ఇంట్లో వచ్చే ‘శాకాహారం’ కామెడీ సరదాగా నవ్విస్తుంది. దానికి తోడు ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ రొటీన్ ఫుడ్ అలవాటు పడిన వారికి శాకాహారం తీసుకుంటే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాటి వల్ల ఆయుష్షును ఎలా పెంచుకోవచ్చు? తదితర విషయాలన్ని ఆడియన్స్‌కి పనికొచ్చేవే. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా... రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడం వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఎలా నష్టపోతారనేది ఇందులో ఎంతో ఉద్వేగంగా చూపించారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌లపై చాలా సినిమాలు ఉన్నా... ఇందులో దానికి పరిష్కారం చూపించడం కొత్తగా ఉంది.
 
హీరో ఆసిఫ్ ఖాన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించారు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌లో అలరించాడు. అతనికి జోడీగా నటించిన మౌర్యాని అటు గ్లామర్... ఇటు పర్ ఫార్మెన్స్‌తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిర్మాత పాత్రలో దర్శకుడు కాశీవిశ్వనాథ్ కాసేపు కనిపించినా... మెప్పించారు. హీరో స్నేహితులగా నటించిన ఇద్దరూ ద్వితీయార్థంలో చక్కగా నవ్వించారు. ముఖ్యంగా సినిమా తారలను అనుకరించే పాత్రలో నటించిన నటుడు బాగా నవ్వించారు. హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ చిత్రంతో హీరోగా పరిచయమయిన  అసిఫ్ ఖాన్‌కి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చు. అతని నటన చాలా సహజంగా ఉంది.
 
ఇక దర్శకుడి విషయానికి వస్తే... సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో... ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని... దాని చుట్టూ అల్లుకున్న కథనం... ఎంగేజింగ్ నడిపించడంలో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఈ సినిమాకి అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. సి హిచ్ మోహన్ చారి అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. హీరో, హీరోయిన్ జంటను అందంగా చూపించారు. నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలున్నా ఈ చిన్న సినిమా ఓవరాల్‌గా చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది!!
 
గో అండ్ వాచ్ ఇట్..!!!
 
రేటింగ్: 3/5