శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (20:03 IST)

అధికారుల తీరుపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం

Natti Kumar
విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలోని సాయిలక్ష్మీ థియేటర్ బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల డబ్బులు దోచుకోవడంతో పాటు ప్రభుత్వ విధానాలకు, ఆదాయనికి తూట్లు పొడుస్తోందని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయిలక్ష్మీ థియేటర్ యజమానులైన బాబ్జి, పవన్ లు తమ అనుయాయులతో ఎస్.ఆర్. కల్యాణమండపం సినిమా 35 రూపాయల టిక్కెట్లను 100 రూపాయలకు బ్లాక్ లో బహిరంగంగా అమ్ముతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. 
 
స్థానిక ఎం.ఆర్.ఓ, ఆర్డీవో లకు ఈ విషయంపై ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. జీ.ఓ. 35 ను అమలు పరచకుండా జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరుస్తున్న బాబ్జి, పవన్ లను అరెస్ట్ చేయడంతో పాటు, స్థానిక ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్లకు నట్టికుమార్ డిమాండ్ చేశారు. 
 
అలాగే విశాఖ జిల్లాలోని ఇంకొన్ని థియేటర్లు కూడా ఇలానే బ్లాక్ టిక్కెట్లకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకుని వెళతానని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ దందాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని, ఆ యజమానులపై కేసులు పెట్టి అరెస్ట్తా చేస్తారని తాను ఆశిస్తున్నట్లు నట్టి కుమార్ వెల్లడించారు.