ఈ నెల 13న సీఎం క్యాంప్ కార్యాలయం విశాఖకు తరలింపు!
విశాఖకు రాజధాని తరలింపు అని అంటారే గాని, అది అయ్యేపని కాదులే అని చాలా మంది ధీమాగా ఉన్నారు. కానీ, మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్లు కనపడుతోంది. అంతే కాదు... ఏపి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తరలింపునకు ఈ నెల 13 ముహూర్తం కూడా పెట్టేసినట్లు విశ్వసనీయ సమాచారం.
విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు త్వరగా తరలిపోవాలని వివిధ శాఖల అధిపతులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2019 జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్కడ విశాఖ బీచ్ ఒడ్డున సెక్రటేరియేట్ నిర్మాణం కూడా దాదాపు పూర్తయిపోయింది. కానీ, ఏదో ఒక రాజకీయ, పరిపాలనాపరమైన అడ్డంకులు ఎదురై, తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడుతూ వస్తోంది.
అయితే, ఈసారి ఇలా కుదరదని, ముఖ్యమైన శాఖలతో పాటు సీఎం క్యాంపు కార్యాలయం కూడా విశాఖకు తరలిపోవాలని సీఎంఓ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం ఎక్కడి నుంచి అయినా పరిపాలన సాగించవచ్చు.... దానికి రాజధానులతో నిమిత్తం లేదని రాష్ట్ర మున్సిపల్ మంత్రి బొత్త సత్యన్నాయాణ ఇటీవల మీడియాతో కూడా చెప్పారు.
సీఎం అమరావతిలోనే ఉండి పరిపాలన సాగించాలని నిబంధన ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. దీనితోనే అమరావతి నుంచి సిఎం క్యాంపు కార్యాలయం తరలిపోతోందని అంతా భావించారు. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ అంశాలు, సీఎం జగన్ బెయిల్ రద్దు అంశం కోర్టులో నడుస్తున్న తరుణంలో తరలింపులు ఉండకపోవచ్చని అంతా భావించారు.
కానీ, దీనికి భిన్నంగా సీఎం క్యాంపు కార్యాలయం ఈ నెల లోనే తరలించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుకూలంగానే ఈ నెల 13న ముహూర్తం కూడా నిర్ణయించారని అంటున్నారు. మరో పది రోజుల్లో సీఎం క్యాంపు కార్యాలయం తరలింపుపై ప్రత్యక్షంగా అందరికీ అనుభవం అవుతుందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొంటున్నారు. ప్రతి సారిలా ఈసారి ఊహాగానాలకు తావుండదు అని అంటున్నారు.