శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (09:20 IST)

బస్తీమే సవాల్.. ఆదివారం 4 గంటలకు పైపుల రోడ్డులో ఆర్జీవీ ప్రెస్మీట్

ఈ నెల 30వ తేదీన నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
నిజానికి ఈ చిత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పైగా, ఘన విజయం కూడా సాధించింది. లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రను పూర్తి నెగెటివ్‌గా చూపించారు. 
 
దీంతో ఈ చిత్రం విడుదలకు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పైగా, కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కూడా చిత్ర అనుమతికి అనుమతించలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల చేసుకోవచ్చని సూచన చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన జగన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆ మరురసటి రోజు ఈ చిత్రాన్ని విడుదల చేసి కుట్రదారుడి అసలు నిజాన్ని చూపిస్తానని వర్మ తాజాగా ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు.
 
అంతేకాకుండా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఎక్కడైతే అరెస్టు చేసి విజయవాడ నుంచి తరిమికొట్టారే అదే ప్రాంతంలో అంటే విజయవాడ పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆదివారం 4 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. బస్తీమే సవాల్. ఎన్.టి.ఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్  అంటూ ట్వీట్ చేశారు.