శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (18:02 IST)

క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' ఆలిండియా పంపిణీ హక్కులు పొందిన శివలెంక కృష్ణప్రసాద్

muralidhar and dir.
muralidhar and dir.
లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, మైదానంలో బంతితో మాయాజాలం సృష్టించిన శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకులు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. 
 
'800' ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏడాదిన్నర పాటు చిత్ర బృందం అంతా ఎంతో శ్రమించి సినిమా తీశారు. శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,  చెన్నై, కొచ్చిన్, చండీగఢ్‌లో చిత్రీకరణ చేశారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన చిత్రమిది. 
 
ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ... 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన పడిన స్ట్రగుల్స్, ఆయన జర్నీ అంతా సినిమాలో ఉంటుంది. ఇటువంటి చిత్రాన్ని ఆలిండియాలో పంపిణీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత ఏడాది మా 'యశోద'ను ఆలిండియాలో విడుదల చేసి నిర్మాతగా సక్సెస్ అందుకున్నాను. ఇప్పుడు '800'ను జాతీయ స్థాయిలో పంపిణి చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ తుది దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 
 
మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ కెఎల్, సినిమాటోగ్రఫీ : ఆర్.డి. రాజశేఖర్, మ్యూజిక్ : జిబ్రాన్, రచన & దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.