ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:13 IST)

చెరగని ముద్ర వేసిన ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలి : అర్జున్

సినీ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మృతిపై సీనియర్ హీరో అర్జున్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ లోకంపై చెరగని ముద్ర వేసిన ఎస్పీబీకి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని ఆయన కోరారు. 
 
శనివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు చెన్నై తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలోని ఫాంహౌస్‌లో పూర్తయ్యాయి. బాలు అంతిమ సంస్కార కార్యక్రమానికి సీనియర్ హీరో అర్జున్ కూడా వచ్చారు.
 
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, తరానికి ఒక్కసారి మాత్రమే మహానుభావులు పుడుతుంటారు! అలాంటి ఘనతర సంగీత కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకంపై చెరగని ముద్రను వేసి మహాభినిష్క్రమణం చేశారన్నారు. 
 
అందువల్ల బాలుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని కోరారు. అయితే, ఆయనకు 'భారతరత్న' కోసం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలన్నీ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఓ వ్యక్తి ఏకంగా 16 భాషల్లో 45 వేల పాటలు పాడడం అంటే సాధారణ విషయం కాదని, రెండు జన్మలు ఎత్తినా అన్ని పాటలు పాడటం ఇకపై అసాధ్యమన్నారు. అందుకే ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరారు. 
 
కాగా, కరోనా వైరస్ బారినపడిన ఎస్పీబాలును ఆగస్టు 5వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. 50 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో భారతీయ సినీ సామ్రాజ్యం మూగబోయింది.