చిరు ఇంట్లో కీలక భేటీ - బాలయ్య ఏమన్నారు.. నాగబాబు కౌంటరేంటి?
టాలీవుడ్ సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ పెద్దల కీలక సమావేశం జరుగుతోంది. ఇందులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేకమంది పెద్దలు హాజరయ్యారు. ఈ భేటీలో సినీ కార్మికులకు రెండో విడత సాయంపై పాటు సీనియర్ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు దర్శకనిర్మాత తమ్మారెడ్డి, దర్శకుడు ఎన్.శంకర్, నిర్మాత సి.కల్యాణ్, బెనర్జీ చిరు నివాసానికి చేరుకున్నారు. ఇదిలావుంటే.. ఈ సమావేశంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, బాలయ్యకు మెగా బ్రదర్ నాగబాబు ఇచ్చిన కౌంటర్ కూడా చర్చకు వచ్చే అవకాశముంది.
అసలు తన తండ్రి ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగానే కౌంటరిచ్చారు.
అసలు బాలయ్య ఏమన్నారనే విషయాన్ని పరిశీలిస్తే, 'ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి, (తెలంగాణ ప్రభుత్వంతో) ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు. మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? ఎవరూ పిలవలేదు. వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? (మంత్రి తలసాని) శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్కడు పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? వక్రీకరించేది ఏంటి... ఇది వాస్తవం' అంటూ బాలయ్య మీడియా ముందు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.
దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా కాస్తంత ఘాటుగానే కౌంటరిచ్చారు. 'ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప... భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి? ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారు. ఇండస్ట్రీకీ, తెరాస ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత' అంటూ డిమాండ్ చేశారు.