సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (09:58 IST)

"సాహో" దెబ్బకు 'బాహుబలి' రికార్డు గల్లంతు.. సెన్సార్ మెంబర్ ఫిదా

హీరో ప్రభాస్ బాహుబలి రెండు భాగాల చిత్రాల తర్వాత నటిస్తున్న చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుజిత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రద్ధా కపూర్ హీరోయిన్. ఆగస్టు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు తిలకించారు. ఇప్పటికే యు/ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రంపై యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధుతో పాటు... ఇతర సభ్యులు ఫిదా అయిపోయారు. దీనిపై పెద్ద సినిమాల విడుదలకు ముందు తొలి రివ్యూను ఇచ్చే ఉమైర్, చిత్రం సూపరన్నారు. తొలి సగ భాగం తర్వాత ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతారని, ప్రభాస్ ఎంట్రీతోనే సినిమాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని అన్నారు.
 
యాక్షన్ సీన్స్, ఛేజింగ్‌లు మతి పోగొట్టేలా ఉన్నాయని, ఈ పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని అన్నారు. ఈ సినిమా సాలిడ్ ఎంటర్‌టైనర్ అని, అభిమానులకు కావాల్సినదానికన్నా ఎక్కువ వినోదమే ఉందన్నారు. గత రికార్డులను కొల్లగొట్టే బ్లాక్‌‌బస్టర్ అంటూ పొగడ్తలు కురిపించారు. కాగా, ఉమైర్ సంధు రివ్యూలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
గతంలో ఉమైర్ కొన్ని పెద్ద చిత్రాలు అద్భుతమని రివ్యూలు ఇవ్వగా, అవి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు 'స్పైడర్', పవన్ కల్యాణ్ 'ఆజ్ఞాతవాసి' తదితర చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అని సంధూ తెలుపగా, అవి అభిమానులను అలరించడంలో విఫలం అయ్యాయి. ఇక 'సాహో' పరిస్థితి ఏంటన్నది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.
 
మరోవైపు, ఈ చిత్రం 2 గంటల 51 నిమిషాల నిడివిగల సాహో చిత్రం యు/ఏ సర్టిఫికేట్ పొందింది. ఇంకోవైపు, థియేటర్ల వద్ద ఇప్పటి నుంచే ఫ్యాన్స్ సందడి మొదలైంది. సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటికీ, పెద్ద పెద్ద పోస్టర్లు, భారీ కటౌట్లతో థియేటర్లను నింపేస్తున్నారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లో ఎక్కడా తొలిరోజు సినిమాకు టికెట్లు దొరకడం లేదు.