దక్షిణాది మహానటి సుబ్బలక్ష్మి ఇకలేరు...
దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించిన సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు. ఆమెకు వయసు 87 సంవత్సరాలు. ఆమె మృతి వార్తను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమె మనవరాలు సౌభాగ్య వెల్లడించారు. ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
వృద్ధాప్యం కారణంగా అస్వస్థతకు లోనైన ఆమెను కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ చిత్రంతో పాటు అక్కినేని నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావేలోనూ నటించారు. పలు సీరియళ్ళలోనూ నటించిన ఆమె ఎన్నో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించారు.
చిత్రపరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పని చేశారు. ఆల్ ఇండియా రేడియోలో సేవలందించారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె పని చేశారు.