త్వరలో నరేంద్ర మోడీ బయోపిక్ : హీరోగా ఎవరంటే..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఇందులో బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ నటించనున్నారు.
ప్రస్తుతం దేశమంతటా బయోపిక్‌ల కాలంనడుస్తోంది. వ్యాపార, క్రీడా, రాజకీయానికి సంబంధించిన పలువురు ప్రముఖుల జీవిత నేపథ్యంలో బయోపిక్స్ తెరకెక్కుతుండగా ప్రధాని మోడీ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలను తరణ్ ఆదర్శ్ నిర్ధారణ చేశారు. పీఎం నరేంద్ర మోడీ అనే టైటిల్‌తో మోడీ బయోపిక్‌ను ఒమంగ్ కుమార్ తెరకెక్కించనున్నారని తెలిపారు. సందీప్ ఎస్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జనవరి 7వ తేదీన ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలకానుంది.
జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ గత ఏడాదిన్నర నుంచి జరుగుతుందట. స్క్రిప్టు, స్టోరీ, స్క్రీన్‌ప్లే తదితర అంశాలపై ఒమంగ్ కుమార్ టీం భారీ వర్క్ చేస్తున్నారు. కాగా, వివేక్ ఓబేరాయ్ తాజాగా తెలుగు చిత్రం "వినయ విధేయ రామ" చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదల కానుంది.