ఆదివారం, 10 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (11:38 IST)

గుండెల్ని పిండేసే విక్రమ్ "నాన్న"

WD
నటీనటులు: విక్రమ్‌, అనుష్క, నాజర్‌ తదితరులు, దర్శకత్వం: విజయ్‌
విడుదల: 15.శుక్రవారం. జులై.2011

పాయింట్‌: మతి స్థిమితంలేని 'నాన్న' తన కుమార్తెను ఎలా పెంచాడనేది కథ.

సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని చిత్రాలు కొన్ని రకాల కథల వరకే పరిమితం. మానవీయకోణంలో రకరకాల కోణాలను ఆవిష్కరించిన కథలతో గతంలో దర్శకులు ముందుకు వచ్చారు. ప్రాణుల్లోకెల్లా మనిషి తెలివైనవాడని అంటారు. అలాగే హృదయమున్నవారూనూ. ఆ మనిషి అన్ని తెలిసినవాడైతే ఫర్వాలేదు. ఏమీ తెలీని చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంటే.. అంటే మానసిక ఎదుగుదలలేని ఆ మనిషి సమాజంలో ఎలా బతకగలడు.

ఎన్ని ఈసడింపులకు లోనవుతాడు. ఎంతమందికి ఆయనపై సానుభూతి కలుగుతుంది. అనే కోణాన్ని దర్శకుడు విజయ్‌ ఆవిష్కరించారు. ఈ పాత్రను గతంలో కమల్‌హాసన్‌ పోషించినా. 'ఐ యామ్‌ శ్యామ్‌'లో మరో నటుడు పోషించినా... తెలుగు, తమిళ ప్రేక్షకులకు అపరిచితుడు విక్రమ్‌ చేసిన మరో కొత్త ప్రయత్నం అభినందనీయం.

కథలోకి వెళితే...
ఊటీలోని చాక్‌లెట్‌ కంపెనీలో విక్రమ్‌ ఓ సాధారణ ఉద్యోగి. మతి స్థితితంలేని అతన్ని ఆ కంపెనీ ఓనర్‌ తన వద్దే ఉంచుకుంటాడు. అతనికి తోడు ఆమె కుమార్తె వెన్నెల. కుమార్తె అంటే ప్రాణం. తను చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. ఊటీలోని తోటివారితో పాటు తనలాగే ఉన్న మరికొందరితో కలిసి జీవితాన్ని చిన్నపిల్లవాడిలా గడిపేస్తుంటాడు. తన కుమార్తె డాక్టర్‌ అయితే చూడాలనుందని ఆమెను మంచి స్కూల్లో చేర్పిస్తాడు.

డబ్బు, పరపతి గల రాజేంద్ర కుమార్తె ఇందు ఆ స్కూల్‌కు కరస్పాండెంట్‌గా వస్తుంది. ముద్దుగా వున్న వెన్నెలకు చాలా దగ్గరవుతుంది. తల్లిలేదని తెలిసి మరింత జాలిపడుతుంది. దాంతో పాఠశాల వార్షికోత్సవానికి వెన్నెలను కథల పోటీలో పాల్గొనేందుకు తగిన విధంగా తీర్చిదిద్దుతుంది. బహుమతులు అందుకునే సమయంలో వెన్నెల తండ్రి విక్రమ్‌ను చూసి ఇందు ఆశ్చర్యపోతుంది. తన తండ్రితో వెన్నెలను చూశానని ఫోన్‌ చేసి చెబుతుంది. ఆమె తండ్రి వచ్చి అక్కడివారితో తన పెద్ద కుమార్తె భాను కుమార్తే వెన్నెల అని చెబుతాడు.
వెన్నెలను తను జాగ్రత్తగా చూసుకుంటానని అక్కడివారితో చెప్పి విక్రమ్‌తోసహా ఊరికి బయలుదేరతాడు రాజేంద్ర. కానీ మార్గమధ్యలో విక్రమ్‌ను దింపేసి వెన్నెలతో వెళ్ళిపోతారు. కుమార్తె దూరమయినందుకు బాధతో ఏడుస్తూ రోడ్డుపై సొమ్మసిల్లు పడివున్న విక్రమ్‌ను లాయర్‌ అనురాధ (అనుష్క) చూసి ఆసుపత్రిలో జాయిన్‌ చేస్తుంది. ఆ తర్వాత విక్రమ్‌ గురించి తెలుసుకుని... వెన్నెలను అతనికి దక్కేలా చేస్తానని పట్టుపడుడుతుంది. ఆ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలేమిటి? ఇద్దరీని కలిపిందా? లేదా? అనేది కథ.

ఈ చిత్రం మొత్తం విక్రమ్‌ తన భుజాలపై మోశాడు. మానసికంగా పరిపక్వతలేని పిల్లవాడి పాత్రలో మెప్పించాడు. కొన్ని ఛాయలు కమల్‌హాసన్‌ను గుర్తుచేసినా.. కథాపరంగా విక్రమ్‌ కన్పిస్తాడు. చిన్నపిల్లవాడిలా మాట్లాడడం. ఇతరులతో తను ఎలా ఉంటాడన్నదానితోపాటు కుమార్తె పట్ల తను ప్రవర్తించిన తీరు కొన్నిసార్లు కళ్ళవెంట నీళ్లు తెప్పిస్తాయి. ప్రధానంగా క్లైమాక్స్‌లో తను చేసిన నటన హృదయం బరువెక్కెలా చేస్తుంది.

ఈ చిత్రానికి అవార్డు రావచ్చని ప్రేక్షకులు అనుకోవడం కనిపించింది. అసలు ఈ పాత్ర పండటానికి మరో కారణం వెన్నెల పాత్ర. బాలనటిగా ఆమె చేసిన నటన అమోఘం. పిల్లలు బిహేవ్‌ చేస్తారు. నటించరు అంటారు. అలా వెన్నెల తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. వీరిద్దరినీ బాగా డీల్‌ చేసిన ఘనత దర్శకుడు విజయ్‌కు దక్కుతుంది.

మదరాసు పట్టణం తర్వాత వెలుగులోకి వచ్చిన దర్శకుడు విజయ్‌. మానవీయ సంబంధాలు మానసిక స్థితిలోని వ్యక్తిలోనూ ఎలా ఉంటాయనేవి చూపించాడు. సీనియర్‌ లాయర్‌గా నాజర్‌ సరిపోయాడు. అతన్ని ఎదుర్కొనే లాయర్‌గా అనుష్క బాగానే చేసింది. ఇతర పాత్రలూ కథానుగుణంగా ఉన్నాయి.

ఊటీలోనే మొదటి భాగం సాగుతుంది. అక్కడి అందాలను కెమెరామెన్‌ తన నైపుణ్యంతో బాగా తీశాడు. బివిఎస్‌ ప్రకాష్‌ బాణీలు బాగున్నాయి. సాహిత్యమూ బాగుంది. 'అనగనగా ఓ రాజు..' పాట, 'మలుపు అంటూ లేకుండా ఏ నదీ ముందుకు సాగలేదని..' పాటలు బాగున్నాయి. సంభాషణలు కొన్నిచోట్ల కంటతడి పెట్టిస్తాయి. 'అమ్మ ఎక్కడుంది' అని అడిగితే.. దేవుడు దగ్గరకు వెళ్ళిందని చెబుతాడు. దేవుడుకి అమ్మలేదా? అని వెన్నెల అడిగితే అమాయకపు ప్రశ్నలు.. ఇలా కొన్ని సందర్భాల్లో ఆకట్టుకున్నాయి.

గతంలో మాధవి నటించిన మాతృదేవోభవ చిత్రం మహిళ హృదయాల్ని దోచుకుంది. ఇప్పుడు ఈ చిత్రం పితృదేవోభవగా చెప్పవచ్చు. ఆద్యంతం ఆర్ట్‌ సినిమాలా నిదానంగా సాగే ఈచిత్రాన్ని చూడాలంటే కాస్త ఓర్పు, సహనం కావాలి. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉన్న ఈ చిత్రం సరదాగా చూడాలనుకునేవారికి ఇది ఎక్కదు. మానవీయ విలువలు, సెంటిమెంట్లు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం పిల్లలతో తల్లులు చూడతగ్గ సినిమా.