సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2017 (20:20 IST)

'అనగనగా ఒక దుర్గ'పై భూస్వామి కన్ను... ఏమైంది? రివ్యూ రిపోర్ట్

అనగనగా ఒక దుర్గ నటీనటులు : ప్రియాంక నాయుడు, విజయ్‌ తదితరులు; సంగీతం : విజయ్‌ బాలాజీ, నిర్మాత : గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి, దర్శకత్వం : ప్రకాష్‌ పులిజాల. మహిళ విద్యాధికురాలైతే కుటుంబాన్ని కాపాడుతుంది. అది లేనినాడు సమాజం పాడైపోతుంది. మహిళ సమస్యలకు ఎది

అనగనగా ఒక దుర్గ నటీనటులు : ప్రియాంక నాయుడు, విజయ్‌ తదితరులు; సంగీతం : విజయ్‌ బాలాజీ, నిర్మాత : గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి, దర్శకత్వం : ప్రకాష్‌ పులిజాల.
 
మహిళ విద్యాధికురాలైతే కుటుంబాన్ని కాపాడుతుంది. అది లేనినాడు సమాజం పాడైపోతుంది. మహిళ సమస్యలకు ఎదిరొడ్డి ధైర్యంతో నిలబడాలంటే అది విద్యతోనే సాధ్యం అని చెబుతూ చేసిన ప్రయత్నమే 'అనగనగా ఒక దుర్గ'. కొత్తవారైన దర్శక నిర్మాతలు తీసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
 
కథ :
ఓ మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్లే దుర్గ(ప్రియాంక). పురిటిలోనే తండ్రి ఆమెను పారివేస్తే ఓ పెద్దాయన రక్షించి ఆమెను పెంచుతాడు. ఆత్మవిశ్వాసం రంగరించడంతో పెరిగి మగాళ్లకు ధీటుగా తయారవుతుంది. పెళ్లీడుకు వచ్చిన ఆమెపై ఆ ఊరి భూస్వామి బావూజీ కన్ను పడుతుంది. అందుకు ఓసారి అవమానానికి గురవుతాడు. దాంతో తన మనుషుల్తో ఆమెను చెరిచేస్తాడు. ఇది తెలిసిన ఊరు ఆమెను వెలివేస్తుంది. 
 
ఆ తర్వాత బాపూజీ ఆమెను తన వద్దే బంధిస్తాడు. ఎలాగో తప్పించుకుని బయటపడిన ఆమెను చిన్ననాటి స్నేహితుడు రక్షిస్తాడు. స్త్రీకి అన్యాయం జరగడానికి కారణం సరైన విద్య లేకపోవటమేనని ఊరిలోని మహిళలను విద్యాబుద్ధులు నేర్పించాలని ప్రయత్నించి వారిద్దరూ భంగపడతారు. దాంతో దీనికి సరైన మార్గం తుపాకీ పట్టటమే అని వాటిని సంపాదించి తనకు, తనలాంటి వారికి అన్యాయం చేసిన వారినందరినీ చంపేస్తుంది. ఇదీ కథ.
 
విశ్లేషణ:
సమాజంలో జరిగిన విషయాలను టచ్‌ చేస్తూ సినిమా తీయడం కష్టమైన పనే. మహిళలు సాధికారత కోసం పోరాడుతున్న చాలామంది గ్రామీణ మహిళలు ఎదుర్కొన్న సమస్యలే ఇవి. స్వాతంత్రం రాకముందు నుంచి, వచ్చాక కూడా స్త్రీపై చులకన భావం పోలేదు. కుగ్రామాల్లో అయితే మరీనూ. ఊరి పెద్ద కనుసన్నల్లోనే నడవాలి. వాడు క్రూరుడైతే ఊరివారంతా చచ్చినట్లు నడవాల్సిందే. కన్నుపడ్డ స్త్రీని పొందాల్సిందే. ఈ నేపథ్యం తీసుకున్నప్పుడు దాన్ని ఊహించని విధంగా ట్విస్ట్‌లతో తీయడం ఒక పద్ధతి. 
 
ఈ తరహా చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. విజయశాంతి నటించిన 'ఓసేయ్ రాములమ్మ.. ఇంచుమించు అలాంటిదే. ఆ తరహా పాత్రను టీవీ నటి ప్రియాంక నాయుడు అద్భుతంగా పోషించింది. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకే నటించాయి. అయితే వున్న ఆర్టిస్టుల్ని ఇంకాస్త నటించేట్లుగా దర్శకుడు ప్రయత్నిస్తే బాగుండేది. 
 
దర్శకుడు ప్రకాష్‌ పులిజాల అతి ముఖ్యమైన సామాజిక కోణాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఆడవాళ్లపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. వాటికి స్త్రీలు ఎలా బలవుతున్నారు అనే అంశాలను బాగా విశదీకరించి చూపించారు. ఒకరకంగా పూలన్‌ దేవి కథ కూడా ఇలాంటిదే. మొదటి భాగమంతా దుర్గ అన్యాయానికి గురికావడం చూపించారు. ఆ సందర్భంగా రేప్‌ చేసే సన్నివేశాలు తక్కువగా చూపిస్తే బాగుండేది. ఇక సెకండాఫ్‌ ఆరంభం నుండి హీరోయిన్‌ ప్రతిఘటనకు దిగడం, పగ తీర్చుకోవడం వంటి సన్నివేశాలని బాగానే చూపించారు.
 
అయితే ఎంత పగడ్బందీగా దర్శకుడు కథను రాసుకున్నా.. అందుకు తగిన సంభాషణలు, ఎమోషన్స్‌ బాగా పండిస్తేనే రక్తి కట్టేది. సినిమాకు ప్రధాన లోపం అక్కడే జరిగింది. చాలా జాగ్రత్తగా తీయాల్సిన సున్నితమైన సన్నివేశాలను వేగంగా, నటనపై ఏమాత్రం అదుపులేని నటుల బంధంతో మరీ ఎక్కువైందన్నట్టు అనిపించేలా తీశారు. కథనానికి తీసుకున్న స్పూర్తి బాగున్నా దాన్ని రాసుకున్న తీరు చాలా పేలవంగా ఉంది. చాలా సన్నివేశాలకు మధ్యన ఎలాంటి కనెక్టివిటీ లేదు. సీరియస్‌ మూవీకి కమర్షియల్‌ జోడింపుగా మధ్యలో పాటలు వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్నిసార్లు అసహజమైన, మరీ పాత రీతిలో ఉన్న సీన్లు ఇబ్బంది కలిగించాయి. దుర్గ మినహా మిగతా పాత్రలు ఆకట్టుకోలేకపోయానే చెప్పాలి.
 
కాగా, దర్శకుడు ప్రకాష్‌ పులిజాల హీరోయిన్‌ ఎంచుకున్న కథ సామాజిక పరంగా బాగానే ఉన్నా దానికి కొద్దిగా కమర్షియల్‌ అంశాలని జోడించి, మంచి కథనాన్ని రాసుకుని, కొంత అనుభవం కలిగిన నటీనటుల్ని ఎంచుకుని ఉంటే బాగుండేది. విజయ్‌ బాలాజీ సంగీతం అక్కడక్కడా మెప్పించింది. సినిమాటోగ్రఫీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ఎడిటింగ్‌ ద్వారా కొన్ని అనవసరమైన సీన్లను తొలగించి ఉండాల్సింది. కొత్తవాడైనా నిర్మాత గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక మంచి సందేశం ఇవ్వాలన్న  ఆశయంతో తీసిన ప్రయత్నం అభినందించదగిందే. దాన్ని ఇంకాస్త కసరత్తుచేసి తీస్తే సినిమా మరోస్థాయిలో వుండేది.
 
రేటింగ్ ‌: 2.5/5