సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ivr
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (18:40 IST)

'జై లవకుశ' కానీ 'స్పైడర్' రానీ 'మహానుభావుడు' తనదైన స్టయిల్లో...

భలేభలే మగాడివోయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు శుక్రవారం విడుదలైంది. భలేభలే మగాడివోయ్ చిత్రంలో హీరోకు మతిమరుపు పాయింట్ తీసుకుని హిట్ కొట్టిన మారుతి మహానుభావుడు చిత్రంలో హీరోకి అతిశుభ్రత... అంటే అబ్సెసివ్ కంపల్

భలేభలే మగాడివోయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు శుక్రవారం విడుదలైంది. భలేభలే మగాడివోయ్ చిత్రంలో హీరోకు మతిమరుపు పాయింట్ తీసుకుని హిట్ కొట్టిన మారుతి మహానుభావుడు చిత్రంలో హీరోకి అతిశుభ్రత... అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సమస్యను పెట్టాడు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే... ఆనంద్(శర్వానంద్) ఓ ఇంజినీర్. ఇతడికి చుట్టుపక్కల అంతా శుభ్రంగా వుండాలి. దుమ్ము కొట్టుకుని తనకు ఎదురుగా ఏదైనా బైక్ కనబడిందంటే... దాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేసి మరీ వస్తాడు. 
 
ఇలా ఏదయినా తనకు ఎదురుగా అపరిశుభ్రంగా వుండకూడదు. ఆఖరికి తన తల్లి చేతులతో కలిపి అన్నం పెట్టబోయినా తినడు. అంతటి శుభ్రతను పాటించే ఆనంద్ తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇతని అతి శుభ్రత ఎన్నో సమస్యలను కొని తెచ్చిపెడుతుంటాయి. ఐతే తన ఆఫీసులోనే పనిచేసే మేఘన(మెహరీన్) శుభ్రతను పాటించడం చూసి తనంటే ఇష్టపడతాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. 
 
ఆనంద్ విషయాన్ని మేఘన తన తండ్రి రామరాజు(నాజర్) వద్ద చెపుతుంది. ఆనంద్ తో మాట్లాడుదామని సిటీకి వచ్చిన రామరాజుకి ఆనంద్ చేష్టలు చూసి షాక్ తింటాడు. అలాంటి వాడితో పెళ్లి వద్దని మొండికేస్తాడు. ఎలాగో తండ్రిని ఒప్పించి ఆనంద్ ను డిన్నర్ కి పిలుస్తుంది మేఘన. అక్కడ జరిగిన సంఘటన, ఆనంద్ ను మేఘన అసహ్యించుకునేలే చేస్తుంది. చివరకి ఆనంద్ ఆమెను దక్కించుకుంటాడా? అతి శుభ్రత సమస్యతో వుండే ఆనంద్ చివరికి ఏమయ్యాడు అనేది మిగిలిన సినిమా.
 
సీన్ టు సీన్ చాలా రిచ్ గా వుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది. శర్వానంద్ నవ్విస్తూనే నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మెహరీన్ గ్లామర్ బాగా ఉపయోగపడింది. భలేభలే మగాడివోయ్ విజయం తర్వాత ఓ ప్లాప్ మూటగట్టుకున్న మారుతికి శర్వానంద్ మహానుభావుడు బ్రేక్ ఇవ్వచ్చని అనుకోవచ్చు. చిత్రంలో కొన్ని లాజిక్స్ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే బాగా డబ్బు వున్న హీరోయిన్ కుటుంబానికి టాయిలెట్, బాత్రూంలు వుండవు. అవన్నీ ఆరు బయటే అనేది హాస్యాస్పదంగా వుంటుంది. అతి శుభ్రత సమస్యతో బాధపడే హీరో... హీరోయిన్ ప్రేమను సాధించుకునేందుకు పల్లెటూరు వెళతాడు కానీ అతడి ప్రవర్తన మాత్రం మారదు. 
 
ఐతే క్లైమాక్సులో ఒక్కసారిగా హీరోయిన్ కోసం మట్టిలో కుస్తీ పోటీలకు దిగి గెలిచి ఆమె మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఒక్కసారిగా హీరోలో ఈ మార్పు రావడం కాస్త ఎబ్బెట్టుగా వుంటుంది. క్రమక్రమంగా మార్పు వచ్చినట్లు చూపిస్తే బావుండేది. ఏదేమైనప్పటికీ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా మహానుభావుడు చిత్రాన్ని మారుతి లాగించేశాడు. ఒకవైపు జై లవకుశ మరోవైపు స్పైడర్ మధ్య మహానుభావుడు తనదైన స్టయిల్లో దూసుకెళతాడని అనుకోవచ్చు.