చిత్రం : జంబ లకిడి పంబ
బ్యానర్: శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్
నటీనటులు: శ్రీనివాస రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తదితరులు.
సంగీతం: గోపీసుందర్.
దర్శకత్వం: జె.బి. మురళీకృష్ణ (మను).
నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్.
నటుడు శ్రీనివాస రెడ్డి నటించిన తాజా చిత్ర "జంబ లకిడి పంబ". గతంలో ఈయన హీరోగా 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. ఇపుడు 'జంబ లకిడి పంబ' అనే చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకప్పటి హిట్ చిత్రం 'జంబ లకిడి పంబ' చిత్రాన్ని ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేదు. ఈ చిత్రంలో సీనియర్ హీరో నరేష్ అలా నటించి, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. దీనికి కారణం ఈ చిత్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ చేసిన మాయ అలాంటిది. మరి ఆ మేజిక్‌ను ఇప్పుడు శ్రీనివాస రెడ్డి చిత్రం రిపీట్ చేయగలదా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తే...
చిత్ర కథను పరిశీలిస్తే...
వరుణ్ (శ్రీనివాసరెడ్డి) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గ్రామ పెద్ద కుమారుడు. ఈయన పల్లవి (సిద్ధి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించరు. దాంతో ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకుంటారు. అయితే చిన్న చిన్న పొరపొచ్ఛాలు రావడంతో లాయర్ హరిశ్చంద్రప్రసాద్ (పోసాని)ను ఆశ్రయిస్తారు. ఆయన అప్పటికే 99 విడాకులు ఇప్పించి ఉంటాడు. వీరిది 100వ విడాకుల కేసు.
ఈ నేపథ్యంలో హరిశ్చంద్రప్రసాద్ ఓ ప్రమాదంలో చనిపోతాడు. ఆత్మగా యమపురికి వెళ్లిన అతనికి ఓ వింత సమస్య ఎదురవుతుంది. తన సమస్య పరిష్కారంలో భాగంగా, ఆయన వరుణ్, పల్లవి ఆత్మలను మారుస్తాడు. అక్కడి నుంచి ఏమైంది? శరీరం ఒకటి, ఆత్మ మరొకటిగా ఆ దంపతులు ఎదుర్కొన్న సమస్యలేంటి? మరలా మామూలుగా మారడానికి హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పిన సలహా ఏంటి? చివరికి భార్యాభర్తలు ఒకటయ్యారా లేదా? వంటి సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.
కథా విశ్లేషణ :
చీటికీ మాటికీ గొడవలుపడే దంపతులు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మాట నిజమే. అలాగే కొంతమంది స్వార్థపరులైన న్యాయవాదులు దీన్నే అవకాశంగా భావించి డబ్బు సంపాదించడానికే మొగ్గుచూపుతుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా లాక్కొస్తుంటారు. ఇంతా జరగకుండా ఉండాలంటే.. ఒక్క క్షణం ఎదుటివారి స్థానంలో నిలుచుని ఆలోచిస్తే అంతా అదే సర్దుకుంటుంది అని చెప్పే సినిమా ఇది. అయితే లైన్‌గా వినడానికి బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. పాటలు కూడా మెప్పించవు.
ఒకరి మీద ఒకరు పగ పట్టడం, ఒకరి కెరీర్‌ను మరొకరు నాశనం చేసుకోవాలనుకోవడం వంటి సన్నివేశాలన్నీ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. అమ్మాయి లక్షణాలతో శ్రీనివాసరెడ్డి, అబ్బాయి లక్షణాలతో సిద్ధి బాగా నటించారు. సత్యం రాజేశ్ ప్రవర్తించే విధానం సహజంగా ఉంటుంది. హరితేజ పాత్ర బావుంది. వెన్నెల కిశోర్ తన పరిధి మేరకు నటించాడు. చాలా సందర్భాల్లో కామెడీ నవ్వించలేకపోయింది. పాటలు ఎప్పుడొస్తాయో, ఎందుకొస్తాయో అన్నట్టు ఉన్నాయి. అమ్మాయిల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు సున్నితంగా, హద్దుమీరకుండా తెరకెక్కించిన విధానం బావుంది. మలుపులు, కొత్తదనం ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు.
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని నటన, నేపథ్య సంగీతం, కెమెరా పనితనం బాగున్నాయి. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, కథనం పేలవంగా ఉండటం, ట్విస్టులు లేకపోవడం, పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం, సాగదీత ధోరణిలో చిత్రం సాగుతుంది.