గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (14:12 IST)

"సమ్"మోహనంగా" ఇంద్రగంటి 'సమ్మోహనం' (మూవీ రివ్యూ)

తెలుగుద‌నానికి పెద్ద‌పీట వేస్తూ... స్వ‌చ్ఛ‌మైన వినోదంతో... సినిమాలు తీసే తెలుగు దర్శకుల్లో ఒకరు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఆయ‌న సినిమాలు ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా ఉంటాయి. ఒకొక్కసారి ఒక్కో ర‌క‌మైన నేప‌థ్

చిత్రం : సమ్మోహనం 
నిర్మాణ సంస్థ : శ్రీదేవి మూవీస్ 
నటీనటులు : సుధీర్ బాబు, అదితిరావు హైద‌రి, సీనియ‌ర్ న‌రేశ్‌, ప‌విత్రా లోకేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నందు, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌ తదితరులు. 
సంగీతం: వివేక్ సాగ‌ర్‌ 
నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌ 
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ‌ ఇంద్ర‌గంటి 
 
తెలుగుద‌నానికి పెద్ద‌పీట వేస్తూ... స్వ‌చ్ఛ‌మైన వినోదంతో... సినిమాలు తీసే తెలుగు దర్శకుల్లో ఒకరు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఆయ‌న సినిమాలు ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా ఉంటాయి. ఒకొక్కసారి ఒక్కో ర‌క‌మైన నేప‌థ్యంతో తీయ‌డం ఆయ‌నశైలి. దాంతో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి సినిమా అన‌గానే ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌నే న‌మ్మ‌కం సగటు ప్రేక్షకుడిలో ఉంటుంది. ఈసారి అనూహ్య‌మైన ప్రేమ‌క‌థను 'స‌మ్మోహ‌నం' పేరుతో తీసి.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 
ఇందులో సుధీర్‌బాబు, అదితిరావులు హీరో హీరోయిన్లుగా నటించారు. మంచి క‌ల‌యిక‌లో వచ్చిన ఈ చిత్రం ఎలావుంది? ఇంద్రగంటి మరోసారి తన మేజిక్‌ చూపించారా? సుధీర్‌బాబు, అదితిలు ఏ మేరకు ఆకట్టుకున్నారు? అనే అంశాలను తెలుసుకోవాలంటే ఈ చిత్ర కథను విశ్లేషించాల్సిందే. 
 
క‌థ‌: 
విజ‌య్‌ కుమార్ (సుధీర్‌బాబు) ఓ చిత్రకారుడు. ఓ చిత్రకారుడిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకొనే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. అదేసమయంలో త‌న‌కు సినిమా వాళ్లంటే అస్సలుపడదు. వారు సినిమాలో చూపించేదంతా న‌టనే.. వారికి ఎమోష‌న్స్ ఉండ‌వు... అనేటువంటి భావ‌న‌లు కలిగివుంటాడు. అయితే విజ‌య్ తండ్రి శ‌ర్వా(సీనియ‌ర్ న‌రేశ్‌)కి మాత్రం సినిమాలంటే ఎంతో అభిమానం ఉంటుంది. రిటైర్మెంట్ అయినా త‌ర్వాత సినిమాల్లో రాణించ‌డానికి త‌నవంతు ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.
 
ఈపరిస్థితుల్లో తన ఇంటిని సినిమా యూనిట్‌కు ఉచితంగా అద్దెకిస్తాడు. కానీ, ఈ చిత్రంలో త‌న‌కో క్యారెక్ట‌ర్ ఉండాలే నిబంధ‌న పెడతాడు. ఆ సినిమాలో హీరోయిన్ స‌మీరా రాథోడ్‌(అదితిరావు హైద‌రి). ఉత్తరాది అమ్మాయి. ఈమెకు తెలుగు రాదు. విజ‌య్‌ని త‌న సినిమాకు తెలుగు డైలాగ్స్ నేర్పించ‌మ‌ని కోరుతుంది స‌మీరా. విజ‌య్ కూడా స‌రేనంటాడు. అలా ఇద్ద‌రి మ‌ధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. 
 
స‌మీర కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌దు. విజ‌య్ చెప్పిన ప్రేమ‌ను మాత్రం తిరస్కరిస్తుంది. దాంతో విజయ్ పిచ్చిపట్టినవాడిలా తయారవుతాడు. ఆ తర్వాత విజయ్ మామూలు మనిషి అవుతాడా? అస‌లు స‌మీరా.. విజ‌య్ ప్రేమ‌ను ఎందుకు తిర‌స్క‌రిస్తుంది? ఇద్ద‌రూ ఒక‌ట‌వుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణ‌: 
సినిమాల మీద పెద్ద‌గా ఒపీనియ‌న్ లేని హీరోకీ, న‌ట‌నే ప్రాణంగా భావించి స‌క్సెస్‌లో ఉన్న అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ‌. పేరుకి ఇది ప్రేమ క‌థే అయినా సినిమా ఆద్యంతం ఎక్క‌డికక్క‌డ ఉప‌న‌దుల‌ను క‌లుపుకొని ప్ర‌వ‌హించే జీవ‌న‌దిలా సాగిపోతుంది. చిత్రం రెండో భాగంలో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త సాధారణంగానే ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగు గొప్ప‌ద‌నం గురించి, సినిమా వాళ్ల‌ను చూసి సాధారణ ప్రజలు చెప్పుకునే మాటలనే రాశారు. తెలుగు ప్రాముఖ్య‌త గురించి బాగానే వివరించారు. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీని దిగుమ మధ్యతరగతి కావడంతో ఇది సూటయ్యిందని చెప్పొచ్చు. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చాలా బాగా కుదిరింది. పాట‌లు కూడా చాన్నాళ్ల త‌ర్వాత బాగా అర్థ‌వంతంగా అనిపించాయి.
 
తొలి స‌గ‌భాగం సినిమా అంతా కూడా విజ‌య్ ఇంట్లో 20 రోజులు షూటింగ్ సంద‌డి... స‌మీర‌తో ప్రేమలో ప‌డే స‌న్నివేశాల‌తోనే సాగుతుంది. మ‌లి భాగంలో కాస్త డ్రామాని జోడించారు. క‌థానాయిక స‌మీర జీవితం వెన‌క ఉన్న సంఘ‌ట‌న‌ల్ని చూపించారు. అవ‌న్నీ సహజంగా న‌టుల జీవితాల్ని క‌ళ్ల‌కు క‌డుతున్న‌ట్టుగా అనిపిస్తాయి. చిన్న క‌థ‌తోనే మంచి సంభాష‌ణ‌లు, మంచి దృశ్యాల‌తో అందంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు వాస్తవికతకు అద్దం ప‌ట్టేలా ఉన్న‌ప్ప‌టికీ... వాటిపైన వ్యంగ్యాస్త్రాలు సంధించిన‌ట్టు అనిపిస్తాయి. 
 
ప‌తాక స‌న్నివేశాల్లో న‌రేష్ చేసే హంగామా బాగుంది. కానీ, బుక్ ఆవిష్క‌ర‌ణ నేప‌థ్యంలో చెప్పే క‌థ‌లు కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తాయి. అయినప్పటికీ.. స‌న్న‌టి క‌థ‌ను సినిమాగా మ‌లిచి, ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా పాజిటివ్ వేలో చెప్పి మెప్పించ‌గ‌లిగారు దర్శకుడు. ఆర్ట్, కెమెరా వ‌ర్క్స్ గురించి ప్ర‌స్తావించాల్సిందే. ఇకపోతే, హీరో సుధీర్‌బాబు గ‌త చిత్రాల‌తో పోలిస్తే మ‌నిషి చాలా బావున్నాడు. హామభావాలు కూడా ప‌లికాయి. అదితీరావు నోట తెలుగు మ‌రింత మ‌ధురంగా వినిపించింది. 
 
ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లను పరిశీలిస్తే, న‌టీన‌టులంద‌రూ బాగా న‌టించారని చెప్పొచ్చు. సంగీతం వినసొంపుగా బాగుంది. మ‌రీ ముఖ్యంగా నేప‌థ్య సంగీతం, హాస్య సన్నివేశాలు బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా ఆర్ట్ వ‌ర్క్ బావుంది. అలాగే, మైనస్ పాయింట్లను పరిశీలిస్తే, హీరోయిన్ క‌ష్టాలు ఇంత‌కు ముందు విన్న‌వే, రెండో స‌గం కాస్త మామూలుగా అనిపిస్తుంది. మొత్తమీద 'సమ్మోహనం' చిత్రం క్లాస్‌గా దర్శకుడు ఇంద్రగంటి తెరకెక్కించాడు.