శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కథలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:21 IST)

మా నాన్న తెచ్చిన మామిడి పళ్లు ఎంతో తీపి

మా ఇంట్లో ఐదుగురు పిల్లలం. అయితేనేం అందరికీ మా నాన్న ఏ లోటూ లేకుండా చూశారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నేను కూడా ఆయన విద్యార్థినే. నేనే కాదు మా పెద్దన్నయ్య కూడా. ఆయన చదువు చెప్పే పాఠశాలలో రెండేళ్లపాటు ఆయనకు విద్యార్థిగా ఉన్నాను. ఆ సంగతి అలా ఉంచితే... 

నాన్నగారు స్కూలు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేటపుడు ఏం తెస్తారా...? అని ఎదురు చూసేవాళ్లం. ఆయన అప్పట్లో తనకు వచ్చే కొద్ది జీతంలోనే ఎంతో పొదుపుగా మాకోసం ఎన్నెన్నో కొని తెచ్చేవారు.

ముఖ్యంగా వేసవి మామిడి పళ్ల సీజన్ వస్తుందంటే... నాడు మా నాన్నగారు మాకు తాటి ఆకుల బుట్టలో ప్రత్యేకంగా తెచ్చిన మామిడి పళ్లు గుర్తుకొస్తాయి. మంచి సువాసనలు వెదజల్లే మామిడి పళ్లను సైకిలు వెనుకవైపు క్యారియర్‌లో పెట్టుకుని తెచ్చేవారు.

తనే బుట్టను కిందికి దించి అందరినీ పిలిచి ఇష్టమైన కాయలను తీసుకోమని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యేవారు. అంతేనా... నాకు ఊహ తెలిసి మా నాన్నగారు నన్ను కొట్టినట్లు కూడా గుర్తు లేదు.

దసరా, దీపావళి, సంక్రాంతి, పండుగలకు మాకోసం ప్రత్యేకంగా ఆయనే పొయ్యి వద్ద కూచుని వండిన తీపి పదార్థాల తాలూకు రుచులు... ఇలా అన్నీ గుర్తున్నాయి. కానీ ఆయన మాత్రం మా మధ్య లేరు. అయితేనేం ఆయన మా ఐదుగురి పిల్లలకూ ఓ మధురమైన నాన్న...