శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (14:20 IST)

నన్ను నమ్మండి... 25 ఎంపీ సీట్లు గెలిపించండి : కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

విజయవాడ వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, బీజేపీ కుట్రలో భాగంగానే తిరుపతి

విజయవాడ వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ మహానాడు ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, బీజేపీ కుట్రలో భాగంగానే తిరుపతి వెంకన్న ఆభరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి ఆలయాన్ని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేశారని, టీటీడీని ప్రధాని నరేంద్ర మోడీ కబ్జా చేయాలని చూశారని ఆరోపించారు. వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు హెచ్చరించారు.
 
బీజేపీ నమ్మకద్రోహం చేసిందని.. విభజన హామీలు అమలుచేయలేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా డిమాండ్‌కు తెలంగాణ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. ఎవరికీ ఇవ్వబోమని చెప్పి 11 రాష్ట్రాలకు హోదా పొడిగించారని... ఏపీపై ఎందుకు వివక్ష చూపుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందే అని డిమాండ్ చేశారు. బీజేపీని వదిలిపెట్టేది లేదని.. హక్కులు సాధించుకుంటామని బాబు స్పష్టంచేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ధర్మపోరాటం చేస్తున్నామని తెలిపారు. 
 
అదేసమయంలో కార్యకర్తలకు ఆయన ఓ పిలుపునిచ్చారు. 2019 సంవత్సరం అత్యంత కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో టీడీపీ విజయభేరీ మోగించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయన్నారు. అందువల్ల టీడీపీకి 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధించుకుంటామన్నారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. తనపై నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు ఆదరించారన్నారు. తమ కష్టాలు తాత్కాలికమే అని.. సమస్యలను అవకాశంగా మలుచుకున్నామన్నారు. 2022 నాటికి మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఉంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు.
 
విభజన కష్టాలు, సమస్యలతో అభివృద్ధి దీక్ష చేపట్టామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే విద్యుత్‌ లోటును అధిగమించామని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో కరెంట్ చార్జీలు పెంచబోమని ప్రకటించిన రాష్ట్రం ఏపీనే అని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామన్నారు. ఎక్కడా లేనివిధంగా సంక్షేమపథకాలు అమలుచేస్తున్నామని గుర్తుచేశారు. 
 
ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా అమలుచేశామన్నారు. కార్పొరేషన్‌ ద్వారా అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌ హాయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామని, అలాగే ఎప్పుడూ లేనంతగా బడ్జెట్‌లో మైనార్టీలకు నిధులు పెంచామని చంద్రబాబు వెల్లడించారు.