సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (12:45 IST)

టీడీపీ-కాంగ్రెస్ దోస్తీతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది : రామ్ మాధవ్

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ స్నేహం చేయడం స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. శనివారం గుంటూరులోని గుంటూరు సిద్దార్థ గార్డెన్స్‌లో ఎన్డ

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ స్నేహం చేయడం స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. శనివారం గుంటూరులోని గుంటూరు సిద్దార్థ గార్డెన్స్‌లో ఎన్డీయే నాలుగేళ్ళ పాలన విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న రాంమాధవ్ ప్రసంగిస్తూ... రాష్ట్రంలో టీడీపీ, వైసీపీకి ధీటుగా బీజేపీని బలోపేతం చేస్తామన్నారు.
 
రాష్ట్రంలో నూతన రాజకీయ విధానానికి బీజేపీ శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామన్నారు. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఉండాలని టీడీపీ కోరుకుంటోందని, ఏపీలో వంశపారంపర్య పాలన, కుల రాజకీయాలు నడుస్తున్నాయని రాంమాధవ్ ఆరోపించారు. అలాగే కాంగ్రెస్‌, జేడీఎస్‌ గెలుపునకు తామే కారణమంటూ టీడీపీ చెప్పుకుంటోందన్నారు. 
 
చంద్రబాబునాయుడు సమస్య వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, ప్రభుత్వ ఖర్చులతో ధర్మదీక్షలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతోనే దివంగత ఎన్టీఆర్ ఆనాడు టీడీపీని స్థాపించారని... కానీ, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలపడాన్ని ప్రజలంతా గమనించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.