శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:20 IST)

పాకిస్థాన్‌తో ప్రేమలో బీజేపీ.. అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారమా? స్వర భాస్కర్

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారుపై సినీ నటి స్వర భాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పైగా, జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆమె తన నిరసనను తెలిపారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌కు చెందిన వారికి పద్మశ్రీ పురస్కారాలు ఇస్తారా అంటూ నిలదీశారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టేవారిని లాఠీలతో కుళ్లబొడుస్తూ పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వంతో పాటు పద్మశ్రీపురస్కారం ఇస్తారా అంటూ ప్రశ్నించింది. 
 
మధ్యప్రదేశ్ రాష్టంరోని ఇండోర్‌లో 'రాజ్యాంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి' అనే అంశంపై భారీ ర్యాలీ జరిగింది. ఇందులో స్వర భాస్కర్ పాల్గొని ప్రసంగించింది. బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగాన్ని వంచించడమేనని అన్నారు. శరణార్థులకు పౌరసత్వాన్ని ఇవ్వడం, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అరెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోందని గుర్తుచేశారు.
 
పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి పౌరసత్వం ఇవ్వడమే కాకుండా అతనికి మీరు పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చారని... ఈ నేపథ్యంలో, సీఏఏకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. ఓవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టిన తమలాంటి వారిని లాఠీలతో కొడుతున్నారని, బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్నారని... మరోవైపు పాకిస్థాన్ జాతీయులకు పద్మశ్రీ ఇస్తున్నారని స్వర భాస్కర్ మండిపడ్డారు. 
 
నాగపూర్‌లో కూర్చొన్న పెద్దలు అక్కడి నుంచి విద్వేషపూరిత రాజకీయాలను విస్తరింపజేస్తున్నారని పరోక్షంగా ఆరెస్సెస్‌పై స్వర భాస్కర్ విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్ జాతిపిత జిన్నా ఎప్పుడో చనిపోయారని... కానీ, అతని నుంచి స్ఫూర్తిని పొందినవారు మతం పేరుతో మరోసారి దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.