మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 జూన్ 2020 (20:41 IST)

ఫోన్లో మాట్లాడుకున్న భారత్-చైనా దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు

“గాల్వన్” నదీ ప్రాంతంలో చైనా ముందస్తు పథకం ప్రకారం చేసిన చర్యలే, సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలు, ఇతర పరిణామాలన్నింటికీ మూల కారణం అని భారత విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీకి స్పష్టం చేశారు. అయితే భారత్ పైనే చైనా నిందలు మోపి, ఇరు దేశాల మిలటరీ అధికారులు చేసుకున్న ఒప్పందాలను, ఏకాభిప్రాయాలను ఉల్లంఘించి, దాడులకు పాల్పడిన భారత్ సైనికులను శిక్షించాలన్నారు చైనా విదేశీ వ్యవహరాల మంత్రి వాంగ్.
 
“గాల్వన్” లోయలో పరిస్థితి సద్దుమణిగిన తర్వాత, మరోసారి భారత్ సైనికులు “వాస్తవాధీన రేఖ”ను దాటి వచ్చి, కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చైనా మంత్రి నిందలు మోపారు. అతి ప్రమాదకరమైన ఈ చర్య ద్వారా భారత్ అంతర్జాతీయ సంబంధాలకు చెందిన మౌలిక నియమాలను ధిక్కరణకు పాల్పడిందంటూ చైనా మంత్రి వాంగ్ యూ భారత్ మంత్రికి తెలిపారు.
 
ఇరువైపులా మొత్తంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మాట వాస్తవమే కానీ, జూన్ 6వ తేదీన ఇరు దేశాలు వచ్చిన అవగాహన మేరకు పరస్పర దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిన అవసరాన్ని భారత్ మంత్రి ఎస్. జయశంకర్ చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు.