శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (09:34 IST)

భారత్ - పాకిస్థాన్ దారులు బంద్? పాక్ కేబినెట్‌లో చర్చ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణ 370ని  ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు రద్దు చేసింది. పైగా, ఆ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజన చేసింది. దీన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. 
 
ఈ చర్యలకు నిరసనగా పాకిస్థాన్ ఇప్పటికే భారత్‌‌తో కొనసాగిస్తూ వచ్చిన దౌత్య వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. అలాగే, గగనతల మార్గాల్లో మూడింటిని పాక్‌ ఇప్పటికే మూసివేసింది. తాజాగా మిగిలిన మార్గాలను కూడా మూసివేయాలని భావిస్తున్నది. దీంతోపాటు పాక్‌ భూభాగం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే అన్ని మార్గాలను కూడా మూసివేయాలని నిర్ణయించింది. 
 
ఇదే అంశంపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరీ స్పందిస్తూ, భారత విమానాలు వెళ్లకుండా పాకిస్థాన్‌ తన గగనతల మార్గాలను పూర్తిగా మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన చట్టపరమైన విధివిధానాలను ప్రభుత్వం సమీక్షిస్తున్నదని ఆయన వెల్లడించారు. 
 
'భారత విమానాల్ని పాక్‌ గగనతలం మీదుగా ప్రయాణించకుండా పూర్తి నిషేధాన్ని విధించే ప్రతిపాదనను ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ పరిశీలించింది. అలాగే, పాక్‌ భూభాగం గుండా ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లే వాణిజ్య మార్గాలను కూడా ఇకపై అనుమతించకూడదని భావిస్తున్నాం. వీటికి సంబంధించిన చట్టపరమైన విధివిధానాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది' అని ఫవాద్ ట్వీట్ చేశారు. 
 
కాగా, గతంలో బాలాకోట్‌పై వాయుసేన దాడుల అనంతరం కూడా పాకిస్థాన్‌ కొంతకాలం పాటు తన గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే. కాగా మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌ గగనతలం మీదుగా రాకపోకలు సాగించడం పాక్‌కు మింగుడుపడటం లేదు. అందుకే తమ గగనతలాన్ని మూసివేయాలని పాకిస్థాన్ భావిస్తోంది.