ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (18:08 IST)

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఇదే :: ఆంధ్రా - తెలంగాణాల్లో పోలింగ్ ఎపుడంటే....

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తొలి దశలో 20 రాష్ట్రాల్లో 91 లోక్‌సభ స్థానాలకు, 2వ దశలో 13 రాష్ట్రాల్లో 97 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 
 
అలాగే, 3వ దశలో 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ సీట్లకు, 4వ దశలో 9 రాష్ట్రాల్లో 71 సీట్లకు, 5వ దశలో ఏడు రాష్ట్రాల్లోని 51 సీట్లకు, 6వ దశలో 7 రాష్ట్రాల్లోని 59 సీట్లకు, 7వ దశలో 8 రాష్ట్రాల్లో 59 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు. 
 
తొలి దశలో ఆంధ్ర, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ పంజాబ్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్, దాదర్ హైవేలి, డయ్యూ అండ్ డామన్, లక్ష్యద్వీప్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ల్లోని 91 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. 
 
రెండో దశలో కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లోని 97 సీట్లకు, మూడో దశలో అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 71 సీట్లకు, 5వ దశలో జమ్మూకాశ్మీర్‌తో పాటు ఏడు రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలు, ఏడో దశలో ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని 59 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు.
 
ఈ ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా, 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత, ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతో కలుపుకుని పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 

కాగా, ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మార్చి 18వ తేదీన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 26వ తేదీ నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.