గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By మోహన్
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:56 IST)

కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయితే హరీష్ రావు కేంద్రమంత్రి అయ్యినట్లే??

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కేసీఆర్‌కి వెన్నుదన్నుగా నిలిచిన హరీష్‌రావు, 2014 ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొంది, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పెద్ద ప్రాజెక్టుల కార్యరూపం దాల్చడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా తన నియోజకవర్గాన్ని డిజిటల్ లావాదేవీలలో మొదటి స్థానంలో నిలిపాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించాడు. అందుకే కేసీఆర్ ఎప్పుడూ హరీష్‌ని ట్రబుల్ షూటర్‌గా పిలుస్తుంటారు. 
 
అయితే ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ మంత్రి పదవుల కేటాయింపులో హరీష్‌రావుకి మొండి చేయి చూపింది. కేటీఆర్ ఇది వరకే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అయితే తాను మాత్రం ఎలాంటి అసంతృప్తిలో లేనని, కేసీఆర్ మాటను శిరసా వహిస్తానని తన గురుభక్తిని చాటుకుంటున్నాడు హరీష్.. గతేడాది చివర్లో కేసీఆర్ కూడా తాను భారతదేశంలోనూ తన మార్కు రాజకీయం చూపిస్తానని చెప్పాడు. ప్రస్తుతం దానికి తొందర లేదంటూనే, భావసారూప్య పార్టీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసి, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం అన్నాడు. 
 
అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 17 సీట్లకు 17 గెలుపొందేలా ప్లాన్ చేసుకుంటున్నాడు కేసీఆర్. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు తమవైపు ఉన్నట్లు అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేసాయి. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో సైతం జగన్‌కి నైతిక మద్దతు అందిస్తామని చెప్పారు కూడా. ఇక హరీష్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష పైగా మెజారిటీతో గెలుపొందారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు హరీష్‌ని నిలబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే సిద్ధిపేటలో హరీష్‌కి బదులు ఎవరిని నిలబెట్టిన వారి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది. 
 
అలాగే హరీష్‌కి మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. దీనినే అస్త్రంగా చేసుకుని హరీష్‌ని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, ఎంపీగా పోటీ చేయించనున్నారట. అలా గెలిచిన తర్వాత కేంద్రంలో ఒకవేళ హంగ్ వచ్చినట్లయితే, ఎవరో ఒకరి పక్షానికి మద్దతునిచ్చి, తమకు మంత్రి పదవిని ఇవ్వవలసిందిగా కోరే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మిషన్ భగీరథ విషయంలో కేంద్రం చిన్న చూపు చూపడమే కాకుండా, నిధులను కేటాయించడంలోనూ మొండి చేయి చూపింది. కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుంది కాబోలు, అందుకే ఆ శాఖ మన చేతిలో ఉన్నట్లయితే దేశంలో వృథాగా సముద్రంలోకి వెళ్లిపోతున్న నీటిని రక్షించుకోవడంలో చర్యలు తీసుకోవచ్చని, దేశంలో తమ మార్కు పాలనను అందించడం కోసం కేసీఆర్ హరీష్‌ని ముందు పెట్టనున్నాడన్నమాట.