సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (15:29 IST)

మహా రాజకీయాల్లో మరో కుదుపు : అజిత్ పవార్ రాజీనామా.. అదే బాటలో ఫడ్నవిస్?

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కుదుపు సంభవించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయన బాటలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రాజీనామా చేయనున్నారనే వార్తలు వినొస్తున్నాయి. 
 
దీంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు బలపరీక్షకు ముందే చేతులెత్తేసినట్టు అయింది. ముఖ్యంగా, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అధిష్టానంపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపి ఉపముఖ్యమంత్రి పదవిని పొందారు. దీంతో ఎన్సీపీ చీలికపై శరద్ పవార్ భగ్గుమన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అజిత్‌పై ఒత్తిడి తేవడంలో విజయం సాధించారు. 
 
తాజాగా అజిత్ పవార్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అజిత్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయలేదని శరద్ పవార్ ప్రకటించారు. కాగా, సోమవారం కాంగ్రెస్ - ఎన్సీపీ - శివసేన ఉమ్మడిగా తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటూ మీడియా ఎదుట పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. 
 
దీనికితోడు... మంగళవారం సాయంత్రం లోగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. పైగా, విశ్వాస పరీక్షను పూర్తిగా వీడియో చిత్రీకరించాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ చేయాలంటూ ఆదేశించింది. దీంతో సంఖ్యాబలం లేదని గ్రహించిన ఫడ్నవిస్, అజిత్‌లు బలపరీక్షకు ముందే చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.