చేతులెత్తేసిన దేవేంద్ర ఫడ్నవిస్ : ప్రజాతీర్పును శివసేన అవహేళన చేసింది..
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతులెత్తేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం ఇచ్చారు. అయితే, తమకు తగినంత సంఖ్యాబలం లేనికారణంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీయే నుంచి బయటికి వస్తేనే శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఆలోచిస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రకటించింది. అయితే ఎన్సీపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పేర్కొంది. మొత్తానికి 'మహానాటకం' ఆదివారం ఒక్కసారిగా వేడెక్కింది.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న గవర్నర్ ఆహ్వానంపై ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే, మళ్లీ సాయంత్రం 4 గంటలకు మరోదఫా సమావేశమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న నిర్ణయానికి కోర్ కమిటీ వచ్చింది. వెంటనే ఫడ్నవీస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని ఆయనతో చెప్పారు.
అనంతరం చంద్రకాంత్ పాటిల్ రాజ్‌భవన్ బయట విలేకరులతో మాట్లాడుతూ 'మా మిత్రపక్షమైన శివసేనతో తలెత్తిన వివాదం (సీఎం సీటును చెరి రెండున్నరేండ్లు పంచుకోవాలన్నది) నేపథ్యంలో ప్రస్తుతం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేము. బీజేపీ-శివసేన కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన అగౌరవ పర్చుతున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న విషయాన్ని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ దృష్టికి తీసుకెళ్లాం' అని పేర్కొన్నారు.