సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (12:23 IST)

ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం రాజీనామా చేయనున్నారు. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇటీవల వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శివసేన - బీజేపీల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఈ రెండు పార్టీలకు పొత్తు కుదర్లేదు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తారని సమాచారం. అయితే, పార్టీ హైకమాండ్ ఆదేశాల కోసం ఆయన వేచిచూస్తున్నారు. ఈ అర్థరాత్రితో మహారాష్ట్ర శాసనసభ కాలపరిమితి ముగియనుంది.
 
సీఎం పదవికి పట్టుబడుతున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరాకపోవడంతో... మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. మరోవైపు శివసేనకు నచ్చజెప్పేందుకు బీజేపీ చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం రాత్రి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో చర్చించేందుకు ఆయన నివాసానికి హిందూ నేత శంభాజీ భిడే వెళ్లారు. అయితే, ఆ సమయంలో ఇంట్లో ఉద్ధవ్ లేకపోవడంతో... ఈ చివరి ప్రయత్నం కూడా విఫలమైంది.