శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (09:55 IST)

మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం... పట్టించుకోని మోడీ - షా ద్వయం

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి విజయభేరీ మోగించింది. మొత్తం 288 స్థానాలకు గాను 161 సీట్లను ఈ కూటమి కైవసం చేసుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ప్రతిష్టంభన నెలకొంది. 
 
ఐదేళ్ళ అధికారాన్ని చెరిసగం పంచుకోవాలన్న డిమాండ్‌ను శివసేన తెరపైకి తెచ్చింది. అంటే ముఖ్యమంత్రి పీఠం తొలుత తమకు ఇవ్వాలన్నది శివసేన డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపైనే బీజేపీ - శివసేనల మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. 
 
మరోవైపు, లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలో (తదుపరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత) శివసేనకు రెండున్నరేండ్లపాటు సీఎం పదవిని అప్పగిస్తామని తామెన్నడూ ఆ పార్టీకి హామీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మంగళవారం కుండబద్దలు కొట్టారు. తదుపరి ప్రభుత్వంలో ఐదేండ్లపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తేల్చిచెప్పారు. 
 
దీన్ని శివసేన నేతలు తిప్పికొట్టారు. ఇదే అంశంపై సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, వచ్చే ఐదేండ్లూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే కొనసాగుతుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టంచేశారు. సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లపాటు పంచుకునేలా లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీ, శివసేన మధ్య 50-50 ఫార్ములాపై ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. 
 
మరోవైపు, 50-50 ఫార్ములాపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు సేన కౌంటరిచ్చింది. ఇదే అంశంపై ఓ వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. 'మళ్లీ మేం అధికారంలోకి వస్తే, పదవులు, బాధ్యతలు సమానంగా పంచుకోవాలని నిర్ణయించాం' అని ఫిబ్రవరి 28న ఫడ్నవీస్‌ మీడియాతో మాట్లాడుతున్న ఆ వీడియోను ఠాక్రే సన్నిహితుడు హర్షల్‌ ప్రధాన్‌ విడుదల చేశారు. 'హామీని కాస్త గుర్తుతెచ్చుకోండి' అంటూ దానికి క్యాప్షన్‌ ఇచ్చారు.