బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (14:34 IST)

శివసేనకు అంత సీన్ లేదు... ఐదేళ్లూ నేనే సీఎం : దేవేంద్ర ఫడ్నవిస్

మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని చెరిసగం పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌పై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన డిమాండ్‌కు తలొగ్గే ప్రసక్తే లేదనీ, ఆ పార్టీకి అధికార పగ్గాలు ఇచ్చే అవకాశమే లేదన్నారు. పైగా, మరో ఐదేళ్ళపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన తేల్చిచెప్పారు. 
 
ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (105), శివసేన (56) సారథ్యంలోనికూటమి 161 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీని శివసేన డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించారు. 
 
మరో ఐదేళ్ల పాటు తానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న ఫార్ములాపై ఒప్పందం ఏమీ లేదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో స్థిరమైన, సమర్థవంతమైన సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శివసేనకు సీఎం పదవి ఇవ్వాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలిపారని ఆయన అన్నారు.
 
రానున్న అయిదేళ్లు బీజేపీయే ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తుంద‌న్నారు. అధికారాన్ని పంచుకునే అంశంపై శివ‌సేన ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి డిమాండ్ చేయ‌లేదన్నారు. ఒక‌వేళ డిమాండ్ చేస్తే, అప్పుడు మెరిట్ ఆధారంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అయిదేళ్లు ప‌టిష్ట‌మైన‌, స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తామ‌న్నారు. 
 
శివ‌సేన‌కు సీఎం పోస్టు ఇవ్వాలా వ‌ద్దా అన్న అంశంపై త‌మ పార్టీ అధ్య‌క్షుడు ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సూత్ర‌ప్రాయ అంగీకారం జ‌ర‌గ‌లేద‌న్నారు. రానున్న అయిదేళ్లు సీఎంగా ఉంటాన‌న్న డౌట్ త‌న‌కు లేద‌న్నారు. బీజేపీ-శివ‌సేన కూట‌మి మ్యాజిక్ మార్క్ దాటినా.. ప్ర‌భుత్వ ఏర్పాటు ఆల‌స్యం అవుతోంది.