మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (17:40 IST)

కాశ్మీర్‌లో అంతా కూల్... 'ఎం-ఎస్‌'లకు "డి" గ్రౌండ్ రిపోర్టు...

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ లోయ నివురు గప్పిన నిప్పులా తయారైంది. ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలను గృహ నిర్బధంలో ఉంచారు. మరోవైపు, ఆర్టికల్ 370 రద్దును అనేక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఒక నివేదికను సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికలో కాశ్మీరు అంతా ప్రశాంతంగా ఉందనీ, ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కాశ్మీరు పునర్విభజన నేపథ్యంలో అధికారాలు, బాధ్యతల బదలాయింపు సజావుగా సాగేలా కాశ్మీరులో అజిత్‌ ధోవల్‌ తనవైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు పట్ల కాశ్మీరీలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఎలాంటి ఆందోళనలూ లేవని.. ప్రజలు తమ పనుల్లో తాము నిమగ్నమయ్యారని అజిత్‌ ధోవల్‌ కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టంచేశారు.
 
అలాగే, రెండుగా ఏర్పడే రాష్ట్రంలో జమ్మూకాశ్మీర్ మళ్లీ రాష్ట్ర హోదా పొందుతుందని ఎప్పటికీ కాశ్మీరును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచబోమని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను స్థానికులు స్వాగతిస్తున్నారని అజిత్ ధోవల్ సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. 
 
వైరల్ అవుతున్న ఎంఎస్‌డి హ్యాష్ టాగ్.. 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని కల్పిస్తూ వచ్చిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ సాహసోపేత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అయితే, ఎంఎస్డీ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇక్కడ ఎంఎస్డీ అంటే మహేంద్ర సింగ్ ధోనీ కాదు. కానీ ఎంఎస్డీ పేరుతో హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. 
 
ఇంతకీ ఈ ఎంఎస్డీ అంటే ఎవరో తెలుసా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి (అమిత్) షా, జాతీయ భద్రతా సలహాదారు (అజిత్) ధోవల్. వీరి ముగ్గురి పేరిట ట్విట్టరాటీలు ఓ హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. 
 
దశాబ్దాల నుంచి అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దుపై ప్రతి ఒక్కరూ మోడీ సర్కారును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసాధ్యమనుకున్న దాన్ని వీరు ముగ్గురూ కలిసి సుసాధ్యం చేశారని, ఇక జమ్మూ కాశ్మీర్‌లో శాంతిని నెలకొల్పి, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిని సారించాలని సలహా ఇస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఉన్న అందాల కాశ్మీరం మరోసారి రావాలని కోరుకుంటున్నారు.
 
అంతకుముందు, ఇదే అంశంపై అమిత్ షా మాట్లాడుతూ, కాశ్మీర్ స్థానిక యువతలో విద్వేష బీజాలు నాటి పెంచారని, పాకిస్థాన్ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు ఇక్కడి యువత బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదం’ అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కాశ్మీర్‌లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయన్నారు. 
 
ఈ ఆర్టికల్ ఉన్నంత వరకూ కాశ్మీర్ యువత భారత్‌లో కలవదని పాక్ నేత జియావుల్ హక్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లాండులలో చదువుకుంటున్నారని విమర్శించారు. జమ్ముకాశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నామని, అందుకే ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.