ఆర్టికల్ 370 సవరణ: ‘కశ్మీర్‌లో అస్థిరత మరింత పెరిగే అవకాశం’
చాలామంది కశ్మీరీలకు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా లభించిన ప్రత్యేక హోదా అనేది వివిధ అంశాలకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. దానివల్లే, దాని ఆధారంగానే ఒకప్పుడు రాచరిక రాజ్యంగా ఉన్న కశ్మీర్ 1947లో భారతదేశంలో కలిసిందని భావిస్తారు. నెహ్రూ, ఆయన ప్రభుత్వం, కశ్మీర్ రాజకీయ నాయకుల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఫలితంగా జమ్మ, కశ్మీర్‌కు ఆ హోదా వచ్చింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రత్యేక ప్రతిపత్తిని ఏకపక్షంగా తొలగించేసింది. 1950ల తర్వాత కశ్మీర్ రాజ్యాంగ హోదాలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు ఇది. ఆచరణాత్మకంగా చూస్తే, ఇది అంతగా అర్థం కాదు. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఆర్టికల్ 370లోని నిబంధనలను నీరుగార్చారు. జమ్మూ కశ్మీర్‌కు సొంత రాజ్యాంగం, సొంత జెండా ఉన్నాయి. కానీ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు మించి దీనికి పెద్దగా స్వయం ప్రతిపత్తి ఏమీ లేదు.
ఆర్టికల్ 370లోని ఒక నిబంధన ప్రకారం, జమ్మూకశ్మీర్‌లో ఇతర రాష్ట్రాల వారు ఆస్తులను కొనుగోలు చేసేందుకు వీళ్లేదు. ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేయడం వల్ల, దాని ప్రభావం ఇప్పటికిప్పుడు పెద్దగా ఉండకపోయినా... కశ్మీర్ లోయలోని జనసంఖ్యలో వర్గాల వారీగా మార్పులొస్తాయేమోనన్న భయం స్థానికుల్లో ఏర్పడొచ్చు. భారత ప్రభుత్వానికి ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది.
తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలలో చెబుతూ వచ్చింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ చెబుతోంది. అలాగే, ముస్లిం మెజారిటీ ఉన్నందుకో లేదంటే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ తనదని అంటున్నందుకో జమ్ము, కశ్మీర్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది.
మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారీ విజయం సాధించడం వల్ల కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం సులువుగా తీసుకోగలిగింది. ఈ నిర్ణయం పట్ల పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించాయి. అయితే, ఈ ప్రకటనకు ముందుగా చేపట్టిన చర్యలను చూస్తే ఈ నిర్ణయానికి కశ్మీర్‌లో వచ్చే స్పందన గురించి కేంద్ర ప్రభుత్వం ముందుగానే ఊహించిందన్న విషయం అర్థమవుతుంది.
జమ్మూకశ్మీర్‌కు అదనపు బలగాలను పంపించారు. పర్యాటనకులను, హిందూ యాత్రికులను తక్షణమే కశ్మీర్‌ను వదిలి వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆదేశించారు. ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్కులను నిలిపివేశారు. ఎవరూ గుమికూడకుండా ఆంక్షలు విధించారు. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులను గృహనిర్బంధం చేశారు.
ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, జమ్ము కశ్మీర్ ఒక రాష్ట్రంగా ఉండబోదని భారత ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు తెలిపింది. తక్కువ జనాభా ఉన్న లద్దాఖ్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయానికి జమ్మూ, లద్దాఖ్‌లో మద్దతు లభిస్తుంది, కానీ కశ్మీర్ లోయలో మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో అత్యంత అనిశ్చిత ప్రాంతమైన కశ్మీర్‌లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది.