అసలు ఎవరండీ ఈ దేత్తడి హారిక? టూరిజం శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక నియమించామంటూ అధికారులు చెప్పడం, దానిపై విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... అసలు దేత్తడి హారిక ఎవరో కూడా తమకు తెలియదన్నారు. ఆమె నియామకం గురించి సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. తను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున త్వరలో దీనిపై విచారణ జరిపి వాస్తవం ఏమిటో తేల్చుతామన్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ ఫేమ్, దేత్తడి హారికగారే ఉంటారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త స్పష్టం చేశారు. హిమాయత్ నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎం.డి మనోహర్ రావుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారిక గారిని తొలగించారని పలు మీడియా చానళ్లలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. దేత్తడి హారికను తొలగించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో ముందుకు వెళుతున్నామన్నారు. అందుకోసమే టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు తక్కువ ఖర్చుతో ప్రచారం చేస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలోనే దేత్తడి హారికను నియమించడం జరిగిందన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఉన్నతాధికారులను సంప్రదించే ముందుకు వెళ్లామన్నారు. అయితే కొందరు గిట్టని వాళ్లు దేత్తడి హారికను తొలగించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటివి నమ్మొద్దన్నారు. తెలంగాణ టూరిజాన్ని నెంబర్ వన్ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికనే కొనసాగుతున్నారని స్పష్టం చేస్తున్నట్లు శ్రీనివాస్ గుప్త చెప్పారు.