శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (17:05 IST)

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

laddu
ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ తయారీ కోసం ఉపయోగించే గోవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపినట్టు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ దారుణం గత వైకాపా ప్రభుత్వం హయాంలో చోటు చేసుకుందని, అందుకే శ్రీవారి లడ్డూ నాణ్యతతో పాటు రుచి తగ్గిపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆవు నెయ్యితో తయారు చేస్తున్నట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, వైకాపా హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ముఖ్యమంత్రి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని చెప్పారు.
 
'తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అయినా.. తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు. సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే
ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. 
 
ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నాం. ప్రక్షాళన చేయమని చెప్పాం. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా నాణ్యత పెంచుతాం. వేంకటేశ్వరస్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోంది. అలాంటప్పుడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది' అని చంద్రబాబు అన్నారు.