కోర్టుకు వచ్చి సొంత పూచీకత్తు సమర్పించాల్సిందే : జగన్ రెడ్డికి హైకోర్టు ఆదేశం
పాస్‌పోర్టు నిరభ్యంతర పత్రం (ఎన్.ఓ.సి) జారీ విషయంలో తమ ముందు హాజరై స్వయంగా రూ.20 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ విజయవాడ ప్రత్యేక కోర్టు (ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే న్యాయస్థానం) విధించిన షరతు విషయంలో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని.. ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్ (జగన్)కు ఈ విషయం బాగా తెలుసని వ్యాఖ్యానించింది.
విజయవాడ ప్రత్యేక కోర్టులో దాఖలైన పరువు నష్టం కేసు 2018 నుంచి పెండింగులో ఉన్న విషయం, ఈ కేసు విచారణలో సహనిందితుడు పాల్గొంటున్నట్లు జగన్‌కు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కేసు విచారణలో జగన్ పాల్గొంటారని భావించడం సహజమన్నారు. పరువు నష్టం కేసులో అలా జరగలేదంది. ప్రస్తుతం జగన్ తరపున న్యాయవాది ప్రత్యేక కోర్టులో వకాలత్ దాఖలు చేసి పాస్‌పోర్టు విషయంలో ఎన్.ఓ.సి కోసం పిటిషన్ వేశారని గుర్తుచేసింది. ప్రత్యేక కోర్టు షరతు విధించడంతో హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది.
దీనినిబట్టి చూస్తే.. తనకు అవసరమైనప్పుడు మాత్రమే జగన్ న్యాయవిచారణ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఉందని ఆక్షేపించింది. పరువు నష్టం కేసులో సమన్లు అందనందున తనను పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించలేదనే జగన్ వాదన సరికాదని పేర్కొంది. సమన్లు అనేవి కేసు పెండింగులో ఉందని తెలియజేసి, విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇచ్చే సమాచారం మాత్రమేనని తెలిపింది.
పరువు నష్టం కేసు గత ఐదేళ్లుగా పెండింగులో ఉందని జగన్‌కు తెలుసని, న్యాయవాదిని నియమించుకొని సానుకూల ఉత్తర్వులు కూడా పొందారని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో సమన్లు అందలేదనే వాదనతో ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పింది. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉన్నానని ఓవైపు చెబుతూనే.. మరోవైపు పూచీకత్తు సమర్పించాలని ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జగన్ ప్రశ్నిస్తున్నారని తప్పుపట్టింది.
అయితే, కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ చెబుతున్నారని, రాజకీయ ప్రముఖుల కేసులను విచారించే విజయవాడ ప్రత్యేక కోర్టు వద్ద ఇలాంటివి సర్వసాధారణమేనని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు సాఫీగా అమలయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం వద్ద తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో పూచీకత్తు నిమిత్తం ప్రత్యేక కోర్టు విధించిన షరతు కఠినమైనది కాదని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. జగన్‌కు ఐదేళ్ల కాల పరిమితితో పాస్‌పోర్టు జారీకి ఎన్వోసీ ఇవ్వాలని విజయవాడ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. పూచీకత్తు, తదితర అంశాల్లో విధించిన షరతులను సమర్థించింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది.