బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (11:53 IST)

విజయవాడకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఆమె ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. ఆమెకు గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు స్వాగతంపలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 
 
అక్కడ నుంచి ఆమె కృష్ణా జిల్లా పోరంకికి బయలుదరేరి వెళుతారు. అక్కడ ఆమెకు గవర్నర్, ముఖ్యమంత్రి పౌర సన్మానం చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు రాష్ట్రపతి విశాఖపట్టణంకు బయలుదేరి వెళతారు. 
 
విశాఖలోని ఆర్కే బిచ్‌లో నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళం జరిపే కార్యక్రమానికి హాజరై, విన్యాసాలకు తిలకిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, నేవీ చీఫ్ హాజరుకానున్నారు. 
 
ఆ తర్వాత సాయంత్రం 6.10 గంటలకు నేవీ హౌజ్‌లో జరిగే నేవీ డే రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు విశాఖపట్టణం నుంచి తిరుపతికి బయలుదేరుతారు. సోమవారం తెల్లవారుజామున శ్రీవారి సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. 
 
కాగా, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖపట్టణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ ఎయిర్‌పోర్టును కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రయాణించే పోరంకి నిడమానూరు ప్రధాన రహదారిపై గస్తీ పెంచారు. 
 
రోడ్డుపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పౌర సన్మాన కార్యక్రమం జరిగే పోరంకిలో ఐదురుగు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 35 మంది ఎస్ఐలు, 800 మంది పోలీసులు భద్రతలో నిమగ్నమయ్యారు.