అవసరమైతే స్టీల్ ప్లాంట్‌ను మేమే కొనుగోలు చేస్తాం.. విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైసీపీ సర్కారు కూడా ఇరుకునపడింది. గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత ప్రభుత్వంపైనే పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధాని మోదీకి సీఎం జగన్ తాజాగా లేఖ రాశారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రధానికి ప్రతిపాదించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌పై జగన్ చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారని సాయిరెడ్డి ట్వీట్‌లో తెలిపారు.
కేంద్రం గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందని ప్రధానికి జగన్ లేఖ రాశారని, అవసరమైతే స్టీల్ ప్లాంట్‌ను తామే కొనుగోలు చేస్తామంటూ ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించింది రాష్ట్రం అంటూ సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన సీఎం జగన్ దీనికి వ్యతిరేకంగా ప్రధానికి ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన నష్టాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని ప్రధానిని కోరారు. అదే సమయంలో నష్టాల నుంచి దీన్ని గట్టెక్కించడానికి పలు ప్రతిపాదనలు చేశారు.